గోకుల్ జంక్షన్ అభివృద్ధిపై దృష్టి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ: హనుమకొండ గోకుల్ జంక్షన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం గోకుల్ జంక్షన్‌ను కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన పరిశీలించారు. కాలనీవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వారికి వివరించారు. అశోక కాలనీ వరద ముంపునకు గురవుతోందని, భారీ వర్షానికి గోకుల్‌నగర్‌లో వరద ఉప్పొంగుతుందని, ఎగువనుంచి వస్తున్న వరద వెళ్లే మార్గం లేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భవన్ నుంచి సమ్మయ్యనగర్ వరకు ప్రస్తుత డ్రెయినేజీకి ప్రత్యామ్నాయంగా మరోవైపు తాత్కాలిక కాలువ తవ్వాలని ఆదేశించారు. గోకుల్ జంక్షన్ అభివృద్ధిలో భాగంగా తగిన విద్యుద్దీపాలు, ఫుట్‌పాత్‌లు, సిగ్నల్ వ్యవస్థలు తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పీసీసీ మెంబర్ ఈవీ శ్రీనివాస్‌రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, అశోక కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ నల్ల సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


