ముగిసిన పేరిణి నాట్య శిక్షణ శిబిరం
హన్మకొండ కల్చరల్: నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ ఆధ్వర్యాన ఏప్రిల్ 24న ప్రారంభమైన పేరిణి నాట్య గురుశిష్య పరంపర–2 శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈమేరకు వరంగల్‌లోని పేరిణి నృత్యాలయంలో అకాడమీ వ్యవస్థాపకులు, పేరిణి నాట్యగురువు గజ్జెల రంజిత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శిక్షణలో పాల్గొన్న 120 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ 14వ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పేరిణి నృత్య అధ్యాపకురాలు చేతరాజు నవ్యజ, అకాడమీ అధ్యక్షరాలు మోత్కూరి చంద్రకళ రామకృష్ణ, నరసింగరావు, పలనాటి శ్రీజ, బండారు వైష్ణవి, గురుదేవ్, తేజస్వీని, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.


