అరచేతిలో ‘మేరీ పంచాయత్‌’ | - | Sakshi
Sakshi News home page

అరచేతిలో ‘మేరీ పంచాయత్‌’

May 16 2025 1:13 AM | Updated on May 16 2025 1:13 AM

అరచేతిలో ‘మేరీ పంచాయత్‌’

అరచేతిలో ‘మేరీ పంచాయత్‌’

సాక్షి, వరంగల్‌: పంచాయతీ ఎన్నికల వేళ.. ‘మేరీ పంచాయత్‌’ యాప్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ ద్వారా గ్రామంలో చేపట్టిన.. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను 2019లోనే రూపొందించినా సాంకేతిక సమస్యలతో ప్రజలకు కొన్ని వివరాలను అందించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఈ యాప్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో అన్ని గ్రామాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌తో ఒక ఊరికి వచ్చే ఆదాయ, వ్యయాల విషయాలన్నీ తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని సైతం ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. జిల్లాలోని 323 పంచాయతీల వివరాలను ఆ యాప్‌లో పొందుపరిచే విధంగా పంచాయతీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఆ నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని, తద్వారా గ్రామాల్లో పారదర్శక పాలన సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. నిధులు, వాటి వినియోగానికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల గ్రామంలో ఎలాంటి పనులను చేస్తున్నారో.. ప్రజలు తెలుసుకునే వీలుంటుంది. ఈ యాప్‌లో వివరాల నమోదు సమయంలోనే జీపీఆర్‌ఎస్‌ ద్వారా గుర్తించే అవకాశం ఉండటంతో, ఒకచోట పనుల కోసం కేటాయించిన డబ్బును మరో చోట వినియోగించేందుకు వీలుండదు. పాలకులు, అధికారులు తప్పుడు రిపోర్టులు తయారుచేస్తే వాటిని ప్రజలు చూసి ప్రశ్నించేందుకు అవకాశాన్ని ఈ యాప్‌ కల్పిస్తుంది. సర్పంచ్‌, కార్యదర్శి, గ్రామ కమిటీల వివరాలను తెలుసుకోవచ్చు. ఏ పనికి ఎంత ఖర్చు చేశారు. అవి ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉన్నాయనే వివరాలు యాప్‌లో ఎంటర్‌ చేస్తారు. పంచాయతీలో నిర్వహించే గ్రామసభల వివరాలు సైతం అందుబాటులో ఉంటాయి. కార్మికులు, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులను కూడా ఇందులో నమోదు చేస్తారు.

యాప్‌లో సమగ్ర సమాచారం

గతంలో సాంకేతిక సమస్యతో ఆగిన ఈ యాప్‌ను కేంద్రం ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చింది. పంచాయతీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ యాప్‌లో వివరాలు పొందుపరచడంపై దృష్టి సారిస్తాం. జిల్లాలోని 323 పంచాయతీల సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచుతాం.

– కల్పన, జిల్లా పంచాయతీ అధికారి

యాప్‌ పనితీరు ఇలా..

స్మార్ట్‌ ఫోన్‌లో ప్లేస్టోర్‌ నుంచి ఈ ‘మేరీ పంచాయత్‌’ పేరుతో సెర్చ్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లాగిన్‌ అయిన తర్వాత సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు ఎంటర్‌ చేయాలి. సంబంధిత పంచాయతీలకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. గ్రామం పేరు, లేదంటే పిన్‌కోడ్‌తో సంబంధిత పంచాయతీ పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. చేసిన పనులకు సంబంధించిన ఫొటోలను యాప్‌లో పొందుపరుస్తారు. తద్వారా పంచాయతీలలో పారదర్శకతకు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

2019లో ప్రత్యేక యాప్‌ రూపకల్పన

సాంకేతిక సమస్యతో ఇబ్బందులు

మళ్లీ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

గ్రామాభివృద్ధి వివరాల నిక్షిప్తం

జిల్లా అధికారులు దృష్టి సారిస్తే

సమగ్ర సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement