
రైతులకు ‘విశిష్ట గుర్తింపు’
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్‌తో సమానమైన ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలని నిర్ణయించింది. ఈమేరకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ పథకం’ను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించనున్నారు. ఇందులో భాగంగా.. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెలాఖరు వరకు దాదాపుగా రైతులందరినీ ఫార్మర్ రిజిస్ట్రీ పథకంలో నమోదు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ముందుకు సాగుతోంది. మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. త్వరలో మీసేవ కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చు. ఈమేరకు వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల వివరాలు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
వివరాలన్నీ ఒకే చోట
హనుమకొండ జిల్లాలో దాదాపు 1.56 లక్షల మంది రైతులు ఉన్నారు. సరైన గణాంకాలు, ధ్రువీకరణలు, నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడం లేదని కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని భూములు, పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయి. రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్రా సమాచారం అందడం లేదు. వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారింది. వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈకార్యక్రమాన్ని ఇటీవల చేపట్టారు. ‘అగ్రి స్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒకే వేదికపై..
రైతులకు అందించే ఈగుర్తింపు కార్డు ద్వారా రైతుల సమగ్ర వివరాలను ఒక వేదికపై అందుబాటులోకి తీసుకొస్తోంది. 11 అంకెల సంఖ్యతో రైతు పేరు, గ్రామం, భూమి వివరాలు, సారవంతం, పంటల అనుకూలత, బ్యాంకు రుణ అర్హత, సబ్సిడీలు, సీఎం కిసాన్ నిధులు, పంట పరిహారం వంటి సమాచారం ఈధ్రువీకరణ కార్డులో అందుబాటులో ఉంటుంది. ఇకపై రుణాల కోసం పట్టాదారు పాస్ బుక్, ఇతర పత్రాల అవసరం ఉండదు. కేవలం ఈ సంఖ్య చెబితే సరిపోతుంది.
ఆవివరాలే ప్రామాణికం..
రాష్ట్రంలో అమలు చేసే పథకాలకు ఈవిశిష్ట నంబర్‌తో కూడిన కార్డుతో సంబంధం లేదు. రైతుల విశిష్ట సంఖ్యకు.. రాష్ట్రంలో అమలయ్యే రైతు భరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు. రాష్ట్రంలో చట్టబద్ధ భూయాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొంది.
వివరాలు నమోదు చేసుకోవాలి..
జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం కొనసాగుతోంది. వ్యవసాయ విస్తరాణాధికారులు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులు ఏఈఓలను కలిసి వివరాలు అందించి విశిష్ట గుర్తింపు కార్డు నంబర్ పొందాలి. జిల్లాలో 55 క్లస్టర్లలో రైతుల వివరాల నమోదు కార్యక్రమం సాగుతోంది.
– రవీందర్ సింగ్, హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి
ప్రత్యేక యాప్..
ప్రత్యేక యాప్ ద్వారా రైతుల పేర్లు నమోదు చేయనున్నారు. ఆధార్‌తో నమోదైన మొబైల్ నంబర్ నమోదు చేసిన తర్వాత రైతు ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా 11 అంకెల సంఖ్యను కేటాయిస్తారు. రైతులకు గుర్తింపు కార్డును ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ద్వారా పేర్లు నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యాప్ ద్వారా ఆధార్ కార్డు మాదిరి ప్రత్యేక కోడ్ ఉండాలనే ఉద్దేశంతో రైతులకు ఆధార్ కార్డు మాదిరి ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. ఒక రైతుకు వివిధ గ్రామాల్లో, వివిధ ప్రాంతాల్లో భూములున్న ఈ నంబర్ ద్వారా ఒకే చోట పూర్తి వివరాలు నిక్షిప్తమవుతాయి. విశిష్ట కార్డు నంబర్ ద్వారా రైతుకు ఎంత భూమి ఉందనేది తెలిసిపోతుంది. ఈపథకం పీఎం కిసాన్.. పంటబీమా, యాంత్రీకరణ, సబ్సిడీలను సులభతరం చేస్తుంది. రైతులు సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కార్డులు అందజేయనున్న ప్రభుత్వం
ముమ్మరంగా సాగుతున్న నమోదు
కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం

రైతులకు ‘విశిష్ట గుర్తింపు’