
మాట్లాడుతున్న ప్రొఫెసర్ వెంకటనారాయణ
గీసుకొండ: పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో రైతుల గురించి మాట్లాడే ప్రతినిధులు కరువయ్యారని, గతంలో చరణ్‌సింగ్ లాంటి అనేక జాతీయ పార్టీల నాయకులు రైతు సమస్యలను పార్లమెంట్‌లో చర్చించేవారని తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు రాచర్ల బాలరాజు అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే.. రాజకీయ పక్షాలు రైతన్నల పక్షాన నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గీసుకొండ మండలం కొనాయమాకుల సమీపంలోని ఓంకార్ గార్డెన్‌లో రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన ‘సంక్షోభంలో భారత వ్యవసాయ రంగం–పరిష్కార మార్గాలు, ప్రభుత్వాల బాధ్యత–మన కర్తవ్యం’ అనే అంశంపై ఉమ్మడి జిల్లా సదస్సు జరిగింది. సదస్సులో వెంకటనారాయణ, రమేశ్, బాలరాజు మాట్లాడుతూ వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, రైతుల కష్టాలు తీర్చేవారు లేరన్నారు. వడగళ్ల వాన, ప్రకృతి వైపరీత్యాలకు రైతులు పంటలు నష్టపోయినా ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. ఎకరానికి రూ.10వేలు కాకుండా రూ.20వేల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సదస్సులో ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరగోని శంకరయ్య, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, ఉపాధ్యక్షుడు హంసల్‌రెడ్డి, నాయకులు లడే మోహన్‌రావు, మోకిడి పీరయ్య, జంగా జనార్దన్‌రెడ్డి, కర్రు రాజిరెడ్డి, ఆవునూరి రాజు, బోళ్ల ఎల్లయ్య, సేర్ల రవీందర్, జెండా అంబయ్య, సోమిడి సాంబయ్య, రైతు సంఘం ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
కొనాయమాకులలో
రైతు సంఘం ఉమ్మడి జిల్లా సదస్సు