
తహసీల్దార్లా.. మజాకా ● ఎగ్జిక్యూటివ్ పోస్టు కోసం పట్టు
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీలు.. వాటివెనుకున్న రాజకీయ ప్రమేయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి తహసీల్దార్లు వచ్చారు. ఇక్కడి వారు ఇతర జిల్లాలకు వెళ్లారు. తాజాగా ప్రభుత్వం తహసీల్దార్ల అభ్యర్థన మేరకు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి పంపింది. దీంతో జిల్లాకు వచ్చినవారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో సూపరింటెండెంట్ పోస్టులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తమకు ప్రాధాన్యం ఉన్న మండలాల్లో పోస్టు కావాలని ఉన్నతాధికారులపై వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జిల్లాలోని 14 మండలాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు తమ సీటుకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ముందే స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని, కదిలించకుండా చూడాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. ముఖ్యంగా హసన్‌పర్తి, ధర్మసాగర్, ఐనవోలు, ఎల్కతుర్తి, కాజీపేట మండలాల విషయంలో అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అటు అధికారులను, ఇటు ప్రజాప్రతిధులను సమన్వయ పరుస్తూ జిల్లా ఉన్నతాధికారులు పోస్టింగ్స్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కొన్ని మండలాల తహసీల్దార్లు తమ సీటుకు ఎసరు వస్తుందని ముందే పసిగట్టి స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని ఎలాగైనా స్థానచలనం కలగకుండా చూడాలని చివరి దాకా ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈక్రమంలో తమకేం కాదని, తమ మండలాలకు ఎవరూ రారులే అనుకుని ఉన్నవారికి మాత్రం ఊహించని రీతిలో బదిలీ జరిగినట్లు ప్రచారం సాగుతోంది.
జిల్లాలో ప్రస్తుత బదిలీల్లో భీమదేవరపల్లి, నడికూడ, పరకాల, వేలేరు తహసీల్దార్ పోస్టులతోపాటు పరకాల డీఏఓ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పోస్టులకు కేటాయించారు. వారిలో కొందరికి మంచి పోస్టులే వచ్చినా.. తాము అనుకున్న స్థాయి పోస్టులు దక్కలేదని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బదిలీల్లో వేలేరు తహసీల్దార్ కోమిని కలెక్టరేట్‌కు, కలెక్ట్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌ను వేలేరుకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వాటిని బుధవారం మళ్లీ మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు బదిలీ చేసిన తహసీల్దార్ కోమిని వేలేరులోనే ఉండేలా, ప్రసాద్ కలెక్టరేట్‌లో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా చాలాకాలం తర్వాత జరిగిన తహసీల్దార్ల బదిలీలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. త్వరలో జిల్లాకు మరో ఇద్దరు తహసీల్దార్లు వస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో వారి రాక ఎవరి సీటుకు ఎసరుతెస్తుందోనని గుసగుసలు మొదలయ్యాయి.
న్యూస్‌రీల్
అయినా
అసంతృప్తి..
కలెక్టరేట్‌లో ఉండేందుకు ససేమిరా...
వేలేరు తహసీల్దార్ రిటెన్షన్
కొందరికి ప్రజాప్రతినిధుల భరోసా
హనుమకొండ జిల్లాలో
తహసీల్దార్ల బదిలీలపై తీవ్ర చర్చ

తహసీల్దార్లా.. మజాకా ● ఎగ్జిక్యూటివ్ పోస్టు కోసం పట్టు