
టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
హన్మకొండ: తమకు పాత రేట్లు గిట్టుబాటు కావడం లేదని స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే పనులు చేయడం సాధ్యపడుతుందని విద్యుత్ కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఈక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ పరిధిలో సబ్ డివిజన్ల వారీగా విద్యుత్ సంబంధ పనులు పూర్తి చేయడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి టెండర్లు పిలిచారు. ఈనెల 22న టెండర్లు వేయాల్సి ఉంది. దీనికిగాను షెడ్యూల్ తీసుకోవడానికి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. గడువులోగా ఒక్క కాంట్రాక్టర్ కూడా షెడ్యూల్ తీసుకోలేదు. దీంతో గురువారం టెండర్లు వేసే అవకాశం లేదు. కాంట్రాక్టర్లు హనుమకొండ సర్కిల్ కార్యాలయానికి వచ్చినా షెడ్యూల్ మాత్రం తీసుకోలేదు. వచ్చిన వారు కూడా ఇతరులెవరైనా టెండర్ల షెడ్యూల్ తీసుకుంటారేమోనని జాగ్రత్తగా గమనిస్తూ కార్యాలయం ఆవరణలోనే కాపుకాశారు. కాంట్రాక్టర్లంతా సమష్టిగా టెండర్లు వేయడానికి ముందుకు రావట్లేదు. వారు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఆరేళ్ల క్రితం స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్లు పెంచలేదని, ప్రతీ మెటీరియల్ రేట్ రెట్టింపు స్థాయిని మించి పెరిగాయని, ఈరేట్లతో పనులు చేస్తే గిట్టుబాటు ఏమో కానీ.. అప్పుల పాలు కావాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. రెండేళ్ల క్రితం తాము సమ్మెకు వెళ్లగా.. నెలన్నర రోజుల్లో పెంచుతామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తాము హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావుకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.
ముగిసిన కాల పరిమితి
సబ్ డివిజన్ పరిధిలో రూ.20 లక్షల్లోపు విద్యుత్ అభివృద్ధి పనులు చేసేందుకు ఏడాది కాల పరిమితితో కాంట్రాక్టర్లను నియమిస్తారు. ఈకాంట్రాక్టర్ల నియామకానికి ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టెండర్లు పిలుస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఖరారు చేసిన కాంట్రాక్టర్ల నియామక కాల పరిమితి ముగిసింది. దీంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు టెండర్లు పిలువగా కాంట్రాక్టర్ల నిరాకరణ ఎదురైంది. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లపై పూర్తి అసంతృప్తితో ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ఏ మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేరు. రేట్ల ఖరారుపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై కాంట్రాక్టర్ల భవితవ్యం ఆధారపడి ఉంది.
ఆరేళ్లుగా పెంచని
స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు
రేట్లు పెంచితేనే టెండర్లకు
వస్తామంటున్న కాంట్రాక్టర్లు