
ఉనికిచర్లకు పట్టణ రూపు తీసుకొస్తా..
ధర్మసాగర్: ఉనికిచర్ల గ్రామానికి పట్టణ రూపు తీసుకొస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధి ఉనికిచర్లలో రూ.1.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, వరద కాలువల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఉనికిచర్ల గ్రామాభివృద్ధికి ‘కుడా’ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత స్వయంగా గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలు తెలుసుకుని అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉనికిచర్ల నుంచి రాపాకపల్లి రోడ్డుకు రూ.41 లక్షలు మంజూరైనట్లు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. ఉనికిచర్లకు 24 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని, త్వరలో మరో 24 మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రంలో రూ.59 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను, ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ధర్మసాగర్ గ్రామానికి 68 ఇల్లు మంజూరు అయ్యాయని, ఇల్లు మంజూరు అయిన వారంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గొప్ప ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో కార్పోరేటర్ ఆవాల రాధికా రెడ్డి, గ్రేటర్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈఈ సంతోశ్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, సీడీపీఓ విశ్వజ, పీఆర్ డీఈ శ్రీనివాసరావు, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఏఈ నిఖిల్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, బల్దియా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి