వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని నాగవరం శివారులో కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయలో బాలవాటిక–1, 2, 3 ప్రవేశాలకుగాను బుధవారం ఉదయం 9.30కు కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో లాటరీ విధానంలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ దశరథరాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో ప్రవేశాలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సైతం లాటరీ విధానంలో ఈ నెల 9న ఉదయం 9.30 గంటలకు, 2వ తరగతికి 11 గంటలకు, 3వ తరగతికి మధ్యాహ్నం 12 గంటలకు, 4వ తరగతికి ఒంటిగంటకు, 5వ తరగతికి 2 గంటలకు ఉంటుందని.. కేంద్రీయ విద్యాలయ వారి మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ nagavaram.kvs.ac.inను లేదా సెల్‌నంబర్ 96528 07273 సంప్రదించాలని సూచించారు.
పరిసరాల శుభ్రతతోసంపూర్ణ ఆరోగ్యం
వనపర్తి రూరల్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా ఆహార పదార్థాలు తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పెద్దగూడెంతండాలో గ్రామపంచాయతీ కార్యాలయంలో తండావాసులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. అలాగే తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ చట్టం, గృహహింస నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఇన్‌చార్జ్ జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రోజు వ్యాయామం చేయడంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. మద్యపానం, ధూమపానంతో రోగ నిరోధకశక్తి తగ్గి అనారోగ్యం బారినపడే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వాల్యానాయక్, మండల వైద్యాధికారి డా.రాకేశ్‌రెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, శ్రీదేవి, కార్యదర్శి రేణుక, గ్రామస్తులు టీక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి సమాజసేవ చేయాలి
వనపర్తిటౌన్: ప్రతి విద్యార్థి తన పరిజ్ఞానం, నైతిక విలువలతో సమాజానికి సేవ చేయాలని ప్రభుత్వ డిగ్రీ కో–ఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్యుడు అంటే కేవలం వైద్యం అందించే వారే కాదని.. సమాజాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచే బాధ్యత గల వ్యక్తులన్నారు. తోటి వారికి, వృద్ధులకు శుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ప్రతి విద్యార్థి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు సాయం చేయడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తోడుగా ఉండటం కూడా ఒక విధమైన సేవేనని వివరించారు. అనంతరం ఇంటర్న్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రాంలో భాగంగా టీఎస్‌కేసీ మెంటర్ నాగేంద్రాచారి విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్స్ స్కిల్స్‌పై అవగాహన కల్పించారు. ఉద్యోగానికి ఎలా సన్నద్ధం అవ్వాలి, ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సమాజానికి అవసరమైన నైపుణ్యాలను ఎలా మెరుగుపర్చుకోవాలో వివరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె.ఉమా, అకాడమిక్ కో–ఆర్డినేటర్ డా. యాదగిరిగౌడ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు ధాంసింగ్, డా. రాఘవేంద్ర, డా. రామకృష్ణమూర్తి, అధ్యాపకులు వెంకటస్వామి, నాగేంద్రాచారి, ఇమ్రాన్ పాల్గొన్నారు.
వరి (ఆర్‌ఎన్‌ఆర్)
క్వింటా రూ.2,243
దేవరకద్ర: దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మంగళవారం ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,243, కనిష్టంగా రూ.2,029 ధర పలికింది. అలాగే హంస రకం వరి ధాన్యం గరిష్టంగా రూ.1,779, ఆముదాలు గరిష్టంగా రూ.6,139, కనిష్టంగా రూ.6,089 ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.


