వనపర్తి: జనగణన–2027 ప్రక్రియలో హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్‌ఎల్‌బీ)ల గుర్తింపే అత్యంత కీలకమని.. జాగ్రత్తగా తయారు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో త్వరలో ప్రారంభం కానున్న జనగణనపై సంబంధిత చార్జ్, అదనపు ఛార్జ్ అధికారులు, స్టాటిస్టికల్ అధికారులు, సాంకేతిక సహాయకులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. మే నెల 11 నుంచి జనగణన ప్రారంభమవుతుందని.. హెచ్‌ఎల్‌బీలను రూపొందించే క్రమంలో ఏ ఒక్క ప్రాంతం తప్పిపోకుండా చూడాలని కోరారు. అన్ని ప్రాంతాలు నమోదయ్యాయా లేదా అని ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. అదేవిధంగా జనగణన నిర్వహించే ఎన్యుమరేటర్లకి 18వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వాలన్నారు. మూడురోజుల పాటు కొనసాగే శిక్షణకు ఎన్యుమరేటర్లు అందరూ హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని.. ఈ నెల 17లోగా అందరికీ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. శిక్షణ కోసం సంబంధిత ఛార్జ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
కనీస సౌకర్యాలు కల్పించాలి..
ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో కనీస మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. తప్పనిసరిగా తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని.. ఉపాధిహామీ పథకానికి సంబంధించి లేబర్ పని దినాలతో పాటు ఇతర లక్ష్యాలను సకాలంలో సాధించాలని ఎంపీడీఓలకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, మాస్టర్ ట్రైనర్లు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


