
కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలకు..
● పోక్సో చట్టం, గుడ్, బ్యాడ్ టచ్‌పై
అవగాహన ఉండాలి
● ఎస్పీ రావుల గిరిధర్
కొత్తకోట రూరల్: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదవి ఉన్నతస్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, మాతృభూమికి మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. బుధవారం మండలంలోని పామాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, పోక్సో చట్టం, గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. సమాజంలో చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించి పోక్సో చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలని, చక్కటి వనపర్తి నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయాలన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆన్‌లైన్‌లో వీడియో కాల్స్ చేసి పోలీసులమంటే నమ్మొద్దని చెప్పారు. కార్యక్రమంలో సీఐ రాంబాబు, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం ఎస్‌ఐలు బి.ఆనంద్, యుగంధర్‌రెడ్డి, హిమబిందు, వైద్యాధికారులు ఆసియాబేగం, శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయుడు రవి, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.