
కాలుష్య బట్టీలు
కానరాని
అధికారుల తనిఖీలు..
జిల్లాలో ఇష్టానుసారంగా బట్టీలు ఏర్పాటు చేస్తుండటం.. వాటిని కాల్చడంతో వచ్చే పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటుకలను కాల్చేందుకు వరిపొట్టుతో పాటు చెట్లను నరికి ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటుక బరువు తగ్గించేందుకు ఉపయోగించే బూడిద గాలికి ఎగిరి కళ్లలో పడితే ఆస్పత్రిలో చికిత్స పొందితేగాని ఉపశమనం లభించని పరిస్థితి ఉందని సమీప ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఆ బూడిద కంటి పొరపై అత్తుకొని తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం గమనార్హం. పొగతో ఊపిరితిత్తుల సమస్యలు నెలకొంటున్నట్లు తెలుస్తోంది.
వనపర్తి: జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీల నిర్వహణ కొనసాగుతోంది. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా నిర్వాహకులు జనావాసాలకు అతి సమీపంలో బట్టీలు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పాన్‌గల్ ప్రధాన రహదారికి అతి సమీపం, మదనాపురం, శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాల్లో ఇటుక బట్టీలు గుట్టలను తలపించేలా ఉన్నాయి. వేసవిలో సమీపంలోని చెరువులు, కుంటల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పొక్లెయిన్లతో ఇష్టారీతిన మట్టిని తవ్వి గుట్టలుగా వేసుకొని ఏడాది పొడవునా ఇటుకల తయారీకి వినియోగిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మైనింగ్, ఇరిగేషన్, కాలుష్య నివారణ అధికారులకు విషయం తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని.. మామూళ్ల మత్తులో ఉన్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గద్వాల, రాయచూరు ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి వారికి అక్కడే తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసి ఇటుకల తయారీ పనులు చేయించుకుంటారు.
జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీల ఏర్పాటు
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
సమస్య ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. కచ్చితమైన ప్రదేశాలు సూచిస్తూ ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారో పరిశీలన చేస్తాం. – సురేష్‌బాబు, జిల్లా అధికారి,
కాలుష్య నియంత్రణ బోర్డు, వనపర్తి
చెరువులు, కుంటలు తవ్వి
మట్టిని తరలిస్తున్న నిర్వాహకులు
కాలుష్య కోరల్లో పట్టణవాసులు
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం?