
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి : ఎస్పీ
వనపర్తి: వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోలీసు డ్యూటీ మీట్‌లోనూ సత్తాచాటి మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. నాగర్‌కర్నూల్‌లో రెండ్రోజుల పాటు నిర్వహించిన జోగుళాంబ జోన్–7 జోనల్ పోలీసు డ్యూటీ మీట్‌లో జిల్లా నుంచి పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది నాలుగు బంగారు, నాలుగు కాంస్య, 5 రజత పతకాలు సాధించారు. శుక్రవారం ఎస్పీ వారిని అభినందించి మాట్లాడారు. ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో వనపర్తి సీఐ కృష్ణయ్య బంగారు, ఫింగర్ ప్రింట్స్ విభాగంలో రజత పతకం సాధించారు. అదేవిధంగా షీటీం ఎస్‌ఐ అంజద్ ఫొటోగ్రఫీ విభాగంలో బంగారు, హ్యాండ్లింగ్ లిఫ్టింగ్ ప్యాకింగ్ విభాగంలో రజత పతకం సాధించారు. గోపాల్‌పేట ఎస్‌ఐ నరేష్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో రజత, క్రైం ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ లాస్ విభాగంలో చిన్నంబావి ఎస్‌ఐ జగన్ రజత పతకం, వనపర్తి రూరల్ కానిస్టేబుల్ శ్రీనివాసులు క్రైం సీన్ అబ్జర్వేషన్ విభాగంలో, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో బంగారు పతకం సాధించారు. వనపర్తి టౌన్ కానిస్టేబుల్ రాజశేఖర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో బంగారు, క్రైం సీన్ అబ్జర్వేషన్ విభాగంలో రజత పతకం సాధించారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు పురేందర్‌గౌడ్, రమేష్ బాంబు డిస్పోజల్ టీం విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఏఆర్ కానిస్టేబుళ్లు రవీందర్, గంగాధర్ యాక్సిస్ కంట్రోల్ విభాగంలో కాంస్య, ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ డాగ్‌స్క్వాడ్ విభాగంలో కాంస్య సాధించారు.