ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన
ఆత్మకూర్: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి అధ్యాపకులతో సమావేశమయ్యారు. కళాశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకొని ప్రవేశాల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. గతేడాది కంటే 30 శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల ఆవరణలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంగా బోధన అందించాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్‌రెడ్డి, టీజే విశ్వేశ్వర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
2,307 ప్రవేశాలే లక్ష్యం..
వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు గతేడాది కంటే 30 శాతం పెంచాలని ఆదేశించడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు ఇంటింటి ప్రచారం చేపడుతున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాలో ఉన్నత పాఠశాలలు ఉన్న ప్రతి గ్రామాన్ని అధ్యాపకులు సందర్శించి ప్రవేశాలు చేయిస్తున్నట్లు వివరించారు. గతేడాది 1,775 అడ్మీషన్లు ఉండగా.. ఈ ఏడాది 30 శాతం కలిపి మొత్తం 2,307 లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కచ్చితంగా లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన


