ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించాలి
వనపర్తి: వరి ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో డబ్బులు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి, జిల్లా సహకార సంఘం, పౌరసరఫరాలశాఖ అధికారులతో వరి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నారు.. ఇంకా ఎంత కేంద్రాలకు రావాల్సి ఉంది.. ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 1.87 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా.. మరో 50 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో ఇంకా 21 వేల మెట్రిక్ టన్నుల ట్యాబ్ ఎంట్రీలు పెండింగ్‌లో ఉందని, మిల్లర్లు దించుకున్న ధాన్యానికి సంబంధించి వెంటనే రసీదులు ఇవ్వకపోవడంతో రైతులకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని కలెక్టర్ తెలిపారు. మిల్లర్ల నుంచి రసీదు త్వరగా వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం చేసిన ధాన్యాన్ని తమకు ఇష్టం వచ్చిన మిల్లుకు పంపించడానికి వీలు లేదని, అధికారి సూచించిన మిల్లుకు మాత్రమే పంపించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సహకార సంఘం అధికారి ఇందిరా, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథం, పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్‌మోహన్ తదితరులు ఉన్నారు.
జిల్లాలో అసైన్డ్ భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాలు, గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములను సర్వేనంబర్ల వారీగా గుర్తించి డేటాను అప్‌లోడ్ చేయాలన్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు సుమారు 5 వేల ఎకరాలు, అసైన్డ్ భూములు 7 వేల ఎకరాలు గుర్తించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్, హెచ్‌హెచ్‌ఓ శంకర్ తదితరులు ఉన్నారు.


