లోక్ అదాలత్‌లో సత్వర న్యాయం : ఎస్పీ
వనపర్తి: జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో ఈ నెల 21న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని.. కక్షిదారులకు పోలీసులు అందుబాటులో ఉంటారని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. క్రిమినల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు, చిన్న చిన్న దొంగతనాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, డ్రంకెన్ డ్రైవ్, న్యూసెన్స్, బ్యాంకు, టెలిఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్‌బౌన్స్ తదితర కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలన్నారు. రాజీయే రాజ మార్గమని.. చిన్న చిన్న తగాదాలతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, న్యాయస్థానం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది రాజీ పడే కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని అవగాహన కల్పించాలన్నారు. వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయని.. ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఓ నిర్ణయానికొస్తే అప్పుడే సమసిపోతాయని అన్నారు. లోక్ అదాలత్‌తో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈకేవైసీ
పూర్తి చేసుకోవాలి
వనపర్తి: జిల్లాలోని రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో కోరారు. మొత్తం 1,80,294 కార్డులు, 6,09,645 మంది లబ్ధిదారులుండగా.. ఇప్పటి వరకు 4,23,466 లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన 1,86,179 మంది లబ్ధిదారులు సమీపంలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి పూర్తి చేసుకోవాలని కోరారు. 5 ఏళ్లలోపు వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. రేషన్ డీలర్లు దుకాణాల ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు 100 ఈకేవైసీకి సహకరించాలని సూచించారు.
తప్పుడు కేసులను
సహించం : కాంగ్రెస్
వనపర్తి: ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన స్థానిక రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి కొత్తకోట రోడ్‌లోని బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వాతంత్య్ర పోరాటం కోసం స్థాపించబడిందని, స్వాతంత్య్రం అనంతరం ఆ పత్రికను ‘యంగ్ ఇండియా’ పేరుతో కొనసాగించారన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకపోయినా గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేసిందని.. ఈ కుట్రను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, ఆమె కుటుంబాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ పత్రిక నెహ్రూ సొంత నిధులతో స్థాపించారని, నేడు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఇల్లు కూడా లేదన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారని, రాజీవ్‌గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. అంతటి విషాదంలోనూ దేశాభివృద్ధి కోసమే సోనియాగాంధీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రధానమంత్రి పదవికి అవకాశం ఉన్నప్పటికీ దేశ హితం కోసం దివంగత నాయకుడు డా. మన్మోహన్‌సింగ్‌ను ప్రధానమంత్రిగా నియమించారని తెలిపారు.


