చెరుకు బిల్లులు సకాలంలో చెల్లించాలి
అమరచింత: చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం ఆయన పలువురు చెరుకు రైతులతో కలిసి కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో ఈడీ రవికుమార్, డీజీఎం నాగార్జునరావుకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వారితో సమావేశమై సమస్యలను వివరించారు. చెరుకు పంటను ఫ్యాక్టరీకి తరలించిన 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలని, లేదంటే 16 శాతం వడ్డీతో కలిపి రైతులకు ఇవ్వాల్సి ఉండగా.. ఆ విధానం నేటికీ అమలు చేయడం కావడం లేదని తెలిపారు. చెరుకు విత్తన బిల్లులు 40 రోజుల్లో ఇస్తామన్న యాజమాన్యం ఇప్పటి వరకు అందించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని.. రాయితీలు, ప్రోత్సాహకాలు సకాలంలో చెల్లించి రైతులను ప్రోత్సహించాలని కోరారు. వచ్చే సీజన్‌లో రికవరీతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర కల్పించాలని, వేరు పురుగు సోకిన పంట రైతులకు యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేటి వరకు రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. త్వరగా చెల్లించి రైతు ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


