
ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి
వనపర్తి: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మత పెద్దలతో ఏర్పాటుచేసిన శాంతి సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. బక్రీద్, హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు సమన్వయం చేయాలన్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా వచ్చే పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా పరిధిలో పశుసంవర్ధక శాఖ సిబ్బందితో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్ధారిత పత్రాలు ఉంటేనే అనుమతిస్తారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువుల అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే పరిస్థితులు తీసుకురావద్దని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే.. సామరస్య పరిష్కారానికి పోలీసు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ప్రజల ఐక్యత, సామరస్యానికి భంగం కలిగించే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సామా జిక మాధ్యమాలపై పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా పెట్టిందని తెలిపారు. అదే విధంగా సభలు, సమావేశాలు, ర్యాలీలకు కచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థ న కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, పశువైద్యశాఖ ఏడీ మీరజ్ అహ్మద్, వెటర్నరీ డాక్టర్ మల్లేష్ ఉన్నారు.
పశువుల అక్రమ రవాణాకు
పాల్పడితే సమాచారం ఇవ్వాలి
ఎస్పీ రావుల గిరిధర్