
వేసవి శిక్షణ.. భవితకు నిచ్చెన
జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో కొనసాగుతున్న శిబిరం
●
కోడింగ్ నేర్చుకుంటున్నా..
జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులో చేరాను. రోజువారి చదువులను పక్కనబెట్టి నృత్యం, యోగా, ఆటపాటలు, కోడింగ్ నేర్పుతున్నారు. కోడింగ్‌ను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా.
– చందన, 9వ తరగతి, కేజీబీవీ, మదనపురం
సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి..
నాకు నృత్యం అంటే ఎంతో ఆసక్తి. దీంతో సమ్మర్ క్యాంపునకు హాజరై రోజువారి అభ్యసనతో పాటు నృత్యం నేర్పిస్తున్నారు. – లక్ష్మి, 8వ తరగతి,
కేజిబివీ, మదనాపురం
నిత్యం పర్యవేక్షణ..
జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో ఈ నెల 6 నుంచి వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు విద్యార్థినులకు కోడింగ్‌తో పాటు నృత్యం, కరాటే, యోగా, డ్యాన్స్ తదితర వాటిలో శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేశాం. ప్రతి కేజీబీవీ నుంచి సిబ్బందిని రప్పించి తరగతులు నిర్వహిస్తుండటంతో పాటు ఇతర అంశాలపై శిక్షణనిచ్చేందుకు వలంటీర్లను నియమించాం. రోజు పర్యవేక్షిస్తూ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – శుభలక్ష్మి, జీసీడీఓ
అమరచింత: వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా, ఇతర వ్యాపకాలపై దృష్టి సారించకుండా ప్రభుత్వం కేజీబీవీ విద్యార్థినులకు వేసవి శిబిరాలు నిర్వహిస్తోంది. జిల్లాలో 15 కేజీబీవీలు ఉండగా.. ఒక్కో కేజీబీవీ నుంచి ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పదిమంది విద్యార్థినులను ఎంపికచేసి జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో 15 రోజుల పాటు శిక్షణనిస్తున్నారు. శిబిరంలో 100 మంది విద్యార్థులు ఉండాలనే నియమం ఉన్నా.. ఆసక్తిగల వారందరికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు జరిగే శిక్షణలో ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కోడింగ్, స్పోకెస్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. విద్యార్థులందరికీ అక్కడే వసతి కల్పించడంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తుండటంతో శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు.
నైపుణ్య శిక్షణ...
కోడింగ్‌తో పాటు నృత్యం, కరాటే, యోగా, డ్యాన్స్, ఆటపాటలను నేర్పించేందుకు రోజువారి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం ఆయా రంగాల్లో శిక్షణ పొందిన వలంటీర్లను ఎంపిక చేసి వారికి 15 రోజులకుగాను రూ.2,500 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. రోజు తెల్లవారుజామున విద్యార్థులను నిద్ర లేపి మొదట యోగా చేయించి వాటితో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. అదేవిధంగా రోజు ఒక అంశంపై బోధన, నృత్యం తదితర అంశాలను నేర్పిస్తున్నారు. నేర్చుకున్న విషయాలను పునశ్ఛరణ చేయించడంతో విద్యార్థులు త్వరగా వాటిపై పట్టు సాధిస్తున్నారు.
హాజరవుతున్న 15 కేజీబీవీల 115 విద్యార్థినులు
ఈ నెల 6న ప్రారంభం.. 20 వరకు కొనసాగింపు
కోడింగ్, స్పోకెన్ ఇంగ్లీష్‌తో పాటు
యోగా, నృత్యం తదితర అంశాల్లో..
ఒక్కో పాఠశాలకు ఒక రోజు..
జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో కొనసాగే వేసవి శిక్షణ శిబిరం నిర్వహణ బాధ్యతను ఆ పాఠశాల ఎస్‌ఓకు అప్పగించగా.. ఒక్కోరోజు ఒక్కో పాఠశాల సిబ్బందికి కేటాయించారు. కేటాయించిన రోజుల్లో ఎస్‌ఓతో పాటు సీఆర్టీలు హాజరై ఇచ్చిన టైంటేబుల్ ప్రకారం విద్యార్థినులకు వివిధ అంశాల గురించి బోధిస్తున్నారు. శిబిరం సవ్యంగా కొనసాగేలా జీసీడీఓ పర్యవేక్షణ చేస్తున్నారు.

వేసవి శిక్షణ.. భవితకు నిచ్చెన

వేసవి శిక్షణ.. భవితకు నిచ్చెన

వేసవి శిక్షణ.. భవితకు నిచ్చెన