
ధాన్యం తరలించడం లేదని రైతుల ఆందోళన
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన దొడ్డురకం ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి మండలంలోని రాజపేట, అంకూర్ గ్రామాల్లో ప్రధాన రహదారులపై రైతులు పెద్దఎత్తున బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సన్ననకం, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరుగా కొంటున్నారని తెలిపారు. సన్నరకాలను కాంటా వేసిన వెంటనే లారీల్లో మిల్లులకు తరలిస్తుండగా.. దొడ్డురకం ధాన్యాన్ని మాత్రం 15 రోజులుగా తరలించడం లేదన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులు మాత్రం లారీలు రావడం లేదని చెబుతూ దాటవేత దోరణి అవలంబిస్తున్నారని వాపోయారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఆయా రహదారులపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగిల్‌విండో చైర్మన్లు వెంకట్రావు, రఘు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, రూరల్ ఎస్‌ఐ జలేందర్‌రెడ్డిలు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.