నాగర్‌కర్నూల్ జిల్లా అధికారికి అదనపు బాధ్యతలు
వనపర్తి: జిల్లా తూనికలు, కొలతలశాఖ అధికారి సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. పెట్రోల్ పంపుల లైసెన్స్ రెన్యూవల్స్, తూకాల్లో మోసాలు, నిబంధనలు ఉల్లంఘించి చేతివాటం ప్రదర్శించారనే కారణాలతో విజిలెన్స్ విభాగం ఇచ్చిన విచారణ నివేధిక ఆధారంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్, రాష్ట్ర కంట్రోలర్ డీఎస్ చౌహాన్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన అవినీతి బాగోతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం, గత నెల 8న ‘సాక్షి’ ప్రధాన పత్రికలో ‘రెన్యూవల్‌కు ఓ రేటుంది’ శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించి విచారణ చేసి చర్యలు తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అధికారి నాగేశ్వర్‌రావుకు జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తె లుస్తోంది. ఈ విషయంపై కలెక్టరేట్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
నేడు జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో బుధవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు జూన్ 1న తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగే 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. అండర్–8లో పాల్గొనే క్రీడాకారులు 02.06.2017 నుంచి 01.06.2019, అండర్–10లో పాల్గొనే క్రీడాకారులు 02.06.2015 నుండి 01.06.2017, అండర్–12లో పాల్గొనే క్రీడాకారులు 02.06.2013 నుంచి 01.06.2015 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు కుల, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని.. పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 99086 29908, 94413 53375, 80961 15222 సంప్రదించాలని సూచించారు.
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు జరగగా.. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 2,374 మంది విద్యార్థులకుగాను 2,179 మంది హాజరు కాగా, 195 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 663 మంది విద్యార్థులకుగాను 614 మంది హాజరు కాగా 49 మంది రాలేదని వివరించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నరేంద్రకుమార్, శ్రీనివాసులు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు, బాలురు, వాగ్దేవి కేంద్రాలను తనిఖీ చేశారు. డీఐఈఓ ఎర్ర అంజయ్య రావూస్, స్కాలర్స్, సీవీ రామన్, విజ్ఞాన్ జూనియర్ కళాశాల కేంద్రాన్ని సందర్శించారు.
నేడు జనభేరి బహిరంగ సభ
వనపర్తి: ప్రజా సమస్యల పరిష్కారం.. హక్కుల సాధన కోసం బుధవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో జనభేరి బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ వెల్లడించారు. మంగళవారం జిల్లాకేంద్రంలో జేఏసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో తిరిగినప్పుడు మా దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, పలు ప్రజాసంఘాల నాయకులు హాజరవుతారని వివరించారు. పార్టీలకతీతంగా నిర్వహించే జనభేరికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు చింతపల్లి సతీష్, పాండురంగ యాదవ్, గోటూరి రవీందర్, వీవీ గౌడ్, కొన్నూర్ గూడు షా, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, రాఘవేందర్‌గౌడ్, ధర్మేందర్, ఆస్కని రమేష్, అక్కల మల్లేష్‌గౌడ్, చెలిమిళ్ల రామన్‌గౌడ్, యశ్వంత్, శ్రీనివాస్‌గౌడ్, రేనట్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా తూనికలు, కొలతల అధికారి సస్పెన్షన్