
ధాన్యం తరలింపులో జాప్యం వద్దు
గోపాల్‌పేట: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి జాప్యం చేయకుండా మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని ఏదుట్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం చేసేందుకు హమాలీలు ఎక్కువగా ఉండేలా చూడాలని, వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్‌కు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని గోదాంను పరిశీలించారు. గోదాంలో ధాన్యం నిల్వకు అనుకూలమైన వాతావరణం, పటిష్ట భద్రత ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గోదాంలోని గన్నీబ్యాగులు తరలించి ఖాళీ చేయాలని, ధాన్యం తరలింపులో అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
‘భూ భారతి’పై సమీక్ష..
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పాండునాయక్, రెవెన్యూ సిబ్బందితో భూ భారతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన మండలంలో దరఖాస్తులను వచ్చే నెల రెండో తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 573 దరఖాస్తులు రాగా.. 246 దరఖాస్తులకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ పాండు వివరించారు. ఇందులో 155 సక్సేషన్ దరఖాస్తులు, మిగిలినవి సాదా బైనామా దరఖాస్తులని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, మిగతావి కలెక్టర్ లాగిన్‌కు పంపించాలని కలెక్టర్ సూచించారు. జూన్ 2 నాటికి రైతుల సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు సహకరించాలన్నారు.
భూ ఫిర్యాదులను త్వరగాపరిష్కరించాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి