
సౌర విద్యుత్‌పై దృష్టి సారించాలి : కలెక్టర్
వనపర్తి: గ్రామాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెడ్కో, విద్యుత్ అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను అమలు చేస్తోందని.. ఐదు వేల కన్నా ఎక్కువ ఇళ్లు ఉన్న రెవెన్యూ గ్రామాల్లో మోడల్ సోలార్ విలేజెస్ పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని దీర్ఘకాలం ఆదాయం సమకూర్చే సోలార్ ప్యానెల్‌ల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రెడ్కో ఎండీ మనోహర్‌రెడ్డిని ఆదేశించారు. ఏ గ్రామంలో అయితే ఎక్కువ ఇళ్లు సోలార్ ప్యానెల్‌తో విద్యుత్ ఆదా చేస్తాయో ఆ గ్రామానికి కేంద్రం సౌర విద్యుత్ ఉపకరణాలకుగా రూ.కోటి అందజేస్తుందని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ పొలంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని విద్యుత్‌శాఖకు విక్రయించడంతో ఒక యూనిట్‌కు రూ.3.13 సంపాదించవచ్చని వివరించారు. పీఎం సూర్యఘర్ పథకంలో గృహ సౌర విద్యుత్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోందని, కుసుమ్ పథకం కింద బ్యాంకు ద్వారా 75 శాతం రుణం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇందులో 4 శాతం బ్యాంకు వడ్డీని కేంద్రమే భరిస్తుందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు సమన్వయంతో గ్రామాల్లో సౌర విద్యుత్‌పై అవగాహన సదస్సులు నిర్వహించాలి సూచించారు. దరఖాస్తు చేసే విధానంపై మీ–సేవ కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇప్పించాలని రెడ్కో డీఎంని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రాజశేఖర్, డీఎ ల్పీఓ రఘునాథ్‌రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయితేజ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం..
ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరగగా 65 అర్జీలు వచ్చినట్లు గ్రీవెన్స్‌సెల్ అధికారులు వెల్లడించారు. అర్జీలను పరిష్కరించాలంటూ ఆయా శాఖల అధికారులకు సిఫారస్ చేశారు.