
కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి
వనపర్తి రూరల్: మెప్మా ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో మెప్మా ఆర్పీల సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్పీలకు పీఎఫ్, ఈఎస్‌ఐ, గుర్తింపు కార్డులు, డ్రెస్‌కోడ్, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటి అమలుకు తీవ్రంగా యత్నిస్తోందని విమర్శించారు. దేశంలోని పరిస్థితిని సమీక్షించిన కేంద్ర కార్మిక సంఘాలు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని.. అన్నిరంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మెప్మా ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు సరస్వతి, కార్యదర్శి లావణ్య, కురుమూర్తి, వేణుగోపాల్, గోపమ్మ, మంజుల, కళావతి, మాలతి తదితరులు పాల్గొన్నారు.