
చరిత్ర పుస్తక రూపంలో పదిలం
వనపర్తి టౌన్: చరిత్రను పుస్తక రూపంలో భద్రపరిస్తే భవిష్యత్ తరాలు తెలుసుకొనే వెసులుబాటు ఉంటుందని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ అన్నారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జ్ఞానదర్శిని ఎల్లూరు చరిత్ర’ పేరున రూపొందించిన పుస్తకాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలో సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. కవులు, కళాకారులు, రచయితలు, చరిత్రకారులు, విద్యావంతులు గతంలోని అంశాలను శోధించి, ధ్రువీకరించుకొని పుస్తక రూపంలోకి తీసుకొస్తారని, ఒక పుస్తకం వెనుక ఎంతో ప్రయత్నం, పర్యవేక్షణ ఉండటంతో వాటిలోని విజ్ఞానం నేటి సమాజానికి అందుతుందని చెప్పారు. ఈ గ్రంఽథ రచనకు నిరంజనయ్య కృషిని ఆయన కొనియాడారు. విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ఎల్లూరు కొల్లాపూర్ సంస్థానానికి కొంతకాలం పాటు రాజధానిగా ఉందని.. చోళులు, కాకతీయుల కాలానికి సంబంధించిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు జనజ్వాల, ఓంకార్, బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, రాజారాంప్రకాశ్, కిరణ్‌కుమార్, గంధం నాగరాజు, డి.కృష్ణయ్య, ఆనంద్, దాసరి కృష్ణ, మోజర్ల కృష్ణ, సురేందర్, రంగస్వామి, వహీద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై
నిరంతర పోరాటం : బీజేపీ
ఖిల్లాఘనపురం: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మండల ఇన్‌చార్జ్ సీతారాములు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బూత్ అధ్యక్షుడు శివ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలోని అన్ని కార్యవర్గ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పని చేయాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి పార్టీ తరుఫున కృషి చేయాలని, అలాంటప్పుడే ప్రజల్లో పార్టీపై, నాయకులపై మంచి అభిప్రాయం కలుగుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కేంద్ర పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిబాబుగౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవినాయక్, మండల ప్రధానకార్యదర్శులు దశరథం, గోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం.రాజు, గోపి ముదిరాజ్, చక్రవర్తిగౌడ్, హేమంత్ నాయక్, ఎస్.సాయినాథ్, శివ, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చరిత్ర పుస్తక రూపంలో పదిలం