
రుణాలు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి
పాన్‌గల్: సింగిల్‌విండో ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన మహాజన సభకు ఆయన హాజరై మాట్లాడారు. విండో ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలతో పాటు రుణాలు అందిస్తున్నామన్నారు. అలాగే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న 1,433 మంది రైతులకు రూ.9.94 కోట్ల మాఫీ వర్తించిందని.. 887 మంది రైతులకు రూ.6.97 కోట్ల వరకు తిరిగి రుణాలు ఇచ్చినట్లు వివరించారు. పంట రుణాలతో పాటు విద్య, గృహ నిర్మాణ, ఉపాధి రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కర్షకమిత్ర ద్వారా రూ.10 లక్షల వరకు రైతులకు రుణాలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ సామగ్రి కొనుగోలుకు 6 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మండల కేంద్రంలో సహకార బ్యాంకు ఏర్పాటు చేస్తామని.. మంత్రి జూపల్లి, ఎంపీ డా. మల్లు రవి సహకారంతో విండోను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం రుణాలు సైతం ఈ బ్యాంకు ద్వారా కూడా పొందవచ్చన్నారు. సమావేశంలో పలువురు రైతులు రైతుభరోసా, రుణమాఫీ కాలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతు భరోసా అర్హులైన వారికి అందుతుందని.. రుణమాఫీ సాంకేతిక, రేషన్‌కార్డు వంటి సమస్యలతో కాలేదని, ప్రభుత్వం పరిష్కరించి అర్హులకు మాఫీ వర్తింపజేస్తుందని చెప్పారు. విండో సిబ్బంది గోవర్ధన్‌సాగర్‌ను సన్మానించారు. సమావేశంలో విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్‌గౌడ్, విండో డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సింగిల్‌విండో ద్వారా
విద్య, ఇంటి, ఉపాధి రుణాలు
ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్
మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి