సమష్టి కృషితోనే పార్టీ బలోపేతం | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే పార్టీ బలోపేతం

Mar 28 2023 1:02 AM | Updated on Mar 28 2023 1:02 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారితో మమేకమవుతూ సమస్యలు తెలుసుకోవాలని.. పార్టీ బలోపేతానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కోరారు. సోమవారం మండలకేంద్రంలోని ఓ తోటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పార్టీ పని చేస్తోందని.. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులందరూ ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఉండాలని సూచించారు. గ్రామస్థాయిలోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి కార్యకర్తల్లో మేమున్నామన్న ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. జూరాల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో ఎత్తిపోతల పఽథకాలను సాధించుకున్నామని, మరిన్ని ఎత్తిపోతల కోసం సీఎంకు విన్నవించినట్లు వివరించారు. నియోజకవర్గానికి 1,100 దళితబంధు యూనిట్లు, మూడు వేల రెండు పడక గదుల ఇళ్లు మంజూరయ్యాయని.. వచ్చే నెలలో అర్హులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బీజేపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా జీవితం కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని.. కుటుంబ సభ్యుడిగా ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవరి మల్లప్ప, జెడ్పీటీసీ సభ్యురాలు మార్క సరోజ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంగమ్మ, మార్కెట్‌ చైర్మన్‌ ఎస్‌ఏ రాజు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేందర్‌సింగ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ నాగభూషణంగౌడ్‌, వైఎస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు చుక్క ఆసిరెడ్డి, మండల అధ్యక్షుడు రమేష్‌ ముదిరాజ్‌, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నర్సింహులుగౌడ్‌, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం 56 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఒకరికి షాదీముబారక్‌ చెక్కును ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్‌ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చాంద్‌పాషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంగమ్మ, వైఎస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement