కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించేందుకే..? | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించేందుకే..?

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించేందుకే..?

రామభద్రపురం: కూటమి ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రోత్సహించేందుకే కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తూ జూన్‌ నెలలో ప్రారంభమయ్యే అకడమిక్‌ విద్యా సంవత్సరాన్ని మార్పు చేస్తూ, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇంటర్‌ సెకెండియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు గతేడాది నుంచి చర్యలు చేపట్టింది. దీనికి సంస్కరణలు అనే సాకు చూపుతుండడం గమనార్హం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించలేకపోతుండడంతో ప్రభుత్వ పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అలా కాకుండా విద్యా వ్యవస్థలో మార్పులు కంటే కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రోత్సహించడం కోసమే సెలవుల్లో తరగతులను ప్రారంభించిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 18, కేజీబీవీలు 26, ఏపీ మోడల్‌ జూనియర్‌ కాలేజీలు 13, సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీలు 8, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు 99 ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న విద్యార్థులు ఇటీవలే ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాశారు. ఈ విద్యార్థులకు 2026–27 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి సెకెండియర్‌ తరగతులు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను జారీ చేశారు. వాస్తవానికి ఈ నెల 6వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షల మూల్యాంకనం జరుగుతుంది. ఇలాంటి సమయంలో బోర్డు జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుంచే తరగతులను ప్రారంభించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సైతం అమలు చేస్తున్నారు. అధ్యాపకులు లేకుండా అకడమిక్‌ ఇయర్‌ను ఎలా ప్రారంభిస్తారు? వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పాఠ్య పుస్తకాల్లేకుండా తరగతులు..

ఇంటర్మీడియట్‌ విద్యలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్‌ 1వ తేదీ నుంచి కాలేజీలు తెరవనున్నారు. అయితే ఏప్రిల్‌ 1 నాటికే విద్యార్థుల చేతికి నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు జిల్లాకు ఒక్క నోటుబుక్కు గాని, పాఠ్యపుస్తకం గానీ చేరలేదు. పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహించడం గమనార్హం.

వారికి మేలు చేసేందుకే ముందస్తు

అనుమతులు..

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలు ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభిస్తూ ప్రభుత్వం షెడ్యూల్‌ జారీచేసింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనుంది. ఆ తర్వాత సుమారు 20 రోజులకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు రాకముందే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వడం వల్ల కార్పొరేట్‌ కళాశాలల వారికి ఎక్కువ సమయం లభిస్తోంది. దీంతో వారు క్యాంపెయిన్లు చేసుకుంటూ విద్యార్థులను లాక్కెళ్లిపోతున్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో సెలవుల్లో తరగతులు నిర్వహిస్తుండడం వల్ల ప్రైవేట్‌ కళాశాలల వారు కూడా విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకోకుండా దర్జాగా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజ్‌లకు మేలు చేసేందుకే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సంస్కరణల పేరుతో ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

ఈ నెల 1 నుంచి 23వ తేదీ వరకు

బ్రిడ్జ్‌ కోర్సు పేరిట తరగతులు

పాఠ్య పుస్తకాల్లేకుండా తరగతులు

నిర్వహిస్తున్న వైనం

నేటి నుంచి ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లు ప్రారంభం

పది పరీక్ష ఫలితాలు రాకముందే

అడ్మిషన్లు

విద్యార్థికి నష్టం లేదు..

ఈ నెల ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠ్యపుస్తకం లేనంత మాత్రాన విద్యార్థికి నష్టం లేదు. ఏదో ఒక అంశం మాత్రమే బోధిస్తారు. మొత్తం సిలబస్‌ మారలేదు. 20 శాతం మాత్రమే సిలబస్‌ మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి సబ్జెక్ట్‌లో రెండు పాఠాలు మాత్రమే బోధిస్తారు. ఈ నెల ఒకటో తేదీ నాటికే పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది. కాని ఇంతవరకు పుస్తకాలు రాలేదు. ఈ నెల 19 నాటికి పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పదో తరగతి ఫలితాలు రాకపోయినా పర్వాలేదు. ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థులు ఈ 23 రోజుల పాటు సబ్జెక్ట్‌లు వింటే తర్వాత ఏ గ్రూపు ఎంపిక చేసుకోవాలో ఉపయోగపడుతుంది.

– ఎస్‌. తవిటినాయుడు,ఆర్‌ఐఓ, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement