బాడంగి: మండలంలోని ముగడ కాలనీకి చెందిన రుత్తల శ్రీహరి వరల్డ్ చీఫ్ ఎక్స్‌పెర్ట్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 2,3 తేదీల్లో ఢిల్లీలో నాస్కమ్ ప్రతినిధులు నిర్వహించిన ఇండియా స్కిల్ పోటీల్లో శ్రీహరి ఇండియా తరఫున సైబర్ సెక్యూరిటీ విభాగంలో చీఫ్ ఎక్స్‌పెర్ట్‌గా వ్యవహరించారు. ఈ పోటీల్లో కర్ణాటకకు చెందిన వారిని గెలిపించి వరల్డ్ చీఫ్ ఎక్స్‌పెర్ట్‌గా ఎంపికయ్యాడు. రానున్న సెప్టెంబర్‌లో చైనాలోని షాంఘైలో జరగనున్న సైబర్ సెక్యూరిటీ పోటీలకు భారత్ బృందానికి తర్ఫీ దు ఇవ్వనున్నట్లు శ్రీహరి తెలిపారు.
కాశీపేటలో అగ్ని ప్రమాదం
సీతానగరం: మండలంలోని కాశీపేటలో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పశువుల శాలలు దగ్ధమయ్యాయి. దీంతో బాధితులు వెన్నెల అప్పలస్వామి, వెన్నెల పరిశినాయుడు లబోదిబోమంటున్నారు. పశువులు లేని సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు. పశువుల శాలల మీదుగా వెళ్తున్న ఎల్‌టీ విద్యుత్ తీగల రాపిడి వల్ల నిప్పులు పడి ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.
రైలు పట్టాలపై మృతదేహం
చీపురుపల్లి: చీపురుపల్లి – బాతువ గ్రామాల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం గుర్తించినట్లు శ్రీకాకుళం జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్.మధుసూదనరావు తెలిపారు. పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని.. నీలం రంగు జీన్స్, సర్ఫ్ కలర్ టీ షర్ట్ ధరించాడని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 91103 05494 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రేగిడి: మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై వి.బాలకృష్ణ అందించిన వివరాల మేరకు.. బలిజిపేట మండలం గళావల్లి గ్రామానికి చెందిన కోండ్రు గోవింద (29) ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి గళావల్లి వైపు వెళ్తున్నాడు. కాగితాపల్లి సమీపంలోకి వచ్చే సరికి రాజాం వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో గోవింద అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏడుగురుపై కేసు నమోదు
కొత్తవలస: మండలంలోని తాడివానిపాలెం గ్రామానికి చెందిన కుడిత కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేశుపాత్రునిపాలెం గ్రామానికి చెందిన డి.గాయత్రి ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముకరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కార్తీక్, గాయత్రి కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి గాయత్రి తల్లిదండ్రులు గతంలో ఒప్పుకోవడంతో ఆమె చదువు, ఇతర అవసరాలకు సుమారు ఏడెనిమిది లక్షల రూపాయలను కార్తీక్ ఖర్చు చేశాడు. తీరా పెళ్లి సమయం వచ్చే సరికి గాయత్రి తల్లిదండ్రులు ప్లేటు ఫిరాయించి, వేరొక వ్యక్తితో కుమార్తెకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై కార్తీక్ ప్రశ్నించగా.. గాయత్రి, ఆమె కుటుంబ సభ్యులు కులంపేరుతో దూషించారు. దీంతో కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


