● భూములను ఆక్రమించుకున్న నాయకులు
● ఆన్‌లైన్ చేయాలంటూ తహసీల్దార్‌పై ఒత్తిడి
● ససేమిరా అనడంతో కబ్జా, ఆపై లీజుకు..
బొబ్బిలి రూరల్: కూటమి నాయకులు బరి తెగిస్తున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఇతరులకు లీజుకిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గోపాలరాయుడుపేట పంచాయతీ వెంకటరాయుడుపేట రెవెన్యూలో గిరిజనులైన గేదెల జోగులు తండ్రి సన్యాసి పేరిట సర్వే నంబర్ 43–2, 47–30, 47–4లో దాదాపు ఐదెకరాల పట్టా భూమి (గయ్యళి భూమి) ఉంది. ఆ భూమిని గతంలో వారు సాగు చేయగా ప్రభుత్వ పట్టా మంజూరు చేసింది. అయితే సన్యాసికి జోగులు ఒకడే కుమారుడు. జోగులుకు కూడా ఒక్క కుమార్తె ఉంది. సన్యాసి, జోగులు మరణానంతరం జోగులు కుమార్తె వారసత్వ సర్టిఫికెట్ తీసుకోలేదు. దీంతో కొన్నాళ్ల తర్వాత ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొందరి కళ్లు ఆ భూమిపై పడ్డాయి. తహసీల్దార్‌కు తాయిళాల ఆశ జూపి ఆ భూమిని తమ పేరుమీద ఆన్‌లైన్ చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. ఆయన ససేమిరా అంటూ ఇది ప్రభుత్వ భూమని బోర్డు ఏర్పాటు చేశారు. ఇదంతా జరిగి ఏడాదైంది. తాజాగా వారం రోజుల కిందట ఆ భూమిని కొందరు కూటమి చోటా నాయకులు ఆక్రమించారు. జేసీబీ, ట్రాక్టర్లతో చదును చేసి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒకరికి ఏకంగా లీజుకు ఇచ్చేశారు. దీంతో లీజుకు తీసుకున్న వ్యక్తి కొద్ది రోజులుగా ఆ భూమిలో పనులు చేపడుతున్నారు. తోటల పెంపకానికి అనువుగా భూమిని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ ఎం. శ్రీను వద్ద ప్రస్తావించగా.. ఆ భూమి ప్రభుత్వానికి చెందిన గయ్యాళి భూమి అని, ఇప్పటికే బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎవరు ఆక్రమించుకున్నా చర్యలు తప్పవన్నారు.


