వీరఘట్టం: పిడుగు పాటుకు మండలంలోని తెట్టంగి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పైల అనసూయమ్మ(60) ఆదివారం మృతి చెందారు. గ్రామ శివారులో ఓ రైతు పొలంలో మొక్కజొన్న పంటలో కంకెలు కోసేందుకు వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో కుప్పకూలిపోయింది. ఆమె ముక్కు, చెవి నుంచి రక్తం రావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై షణ్ముకరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎం.సీతారాంపురంలో పిడుగు..
వంగర: మండల పరిధి ఎం.సీతారాంపురం గ్రామంలో బొద్దాన ఆదినారాయణ ఇంటిపై పిడుగు పడింది. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఇంటి ముందు భాగంలో పిడుగు పడడంతో గచ్చుకు రంధ్రం ఏర్పడింది. ఆ ఇంట్లో శుభకార్యం కారణంగా బంధువులంతా ఒకేచోట కూర్చుని ఉన్నారు. వారి కళ్ల ముందరే పిడుగు పడడంతో ఓ వ్యక్తి కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే సపర్యలు చేయడంతో కోలుకున్నాడు.


