● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి
● పీజీఆర్‌ఎస్‌లో 111 వినతుల స్వీకరణ
పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారులు తెలియజేసిన సమస్యలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని, అలాగే అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ కె.హేమలత, తదితర అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 111 అర్జీలు స్వీకరించారు. ఇందులో 25 అర్జీలు రెవెన్యూ శాఖవి కాగా.. 86 ఇతర శాఖలకు సంబంధించినవి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులనుఆదేశించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని ఇలా..
● కురుపాం మండలం దొమ్మిడి గ్రామం నుంచి జలగెడ్డ వరకు రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామస్తులు దరఖాస్తును అందజేశారు. అలాగే కురుపాంలో ఇళ్ల మీదుగా విద్యుత్ తీగలు వెళ్తున్నాయని.. వాటిని సరిచేయాలని కోరుతూ పలువురు వినతిపత్రం అందజేశారు.
● అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదని సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన ఆర్. భాస్కరరావు అర్జీ సమర్పించాడు.
● ఆక్రమణకు గురైన భూమిని ఇప్పించాలని కోరుతూ గరుగుబిల్లి మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన రౌతు రామినాయుడు అధికారులను కోరుతూ వినతిపత్రం అందజేశారు.


