క్రైమ్‌ కార్నర్‌.. | - | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ కార్నర్‌..

Mar 9 2026 7:45 AM | Updated on Mar 9 2026 7:45 AM

క్రైమ్‌ కార్నర్‌.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెరువులో పడి చిన్నారి మృతి

డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని అయినాడ జంక్షన్‌ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎ.సన్యాసినా యుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా ఆనందపురంలో జరగనున్న వాహనాల వేలంలో పాల్గొనేందుకు విజయనగరానికి చెందిన పులప అప్పారావు శనివారం ఉదయం బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో విజయనగరం వస్తుండగా.. రాత్రి 9.30 గంటల సమయంలో అయినాడ జంక్షన్‌ వద్ద ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీ కొట్టింది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పారావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవు తున్నారు.

భామిని: మండలంలోని సతివాడ గ్రామానికి చెందిన పున్నాన తేజ (7) చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తేజ తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కర్ర చెరువు వద్ద ఆటలాడుతూ.. చేపలు పట్టే క్రమంలో చెరువులో దిగారు. ఈక్రమంలో తేజ ప్రమాదవశాత్తూ చెరువులో కూరుకుపోయి మృతి చెందాడు. దీంతో భయాందోళనలకు గురైన స్నేహితులు కేకలు వేశారు. దీంతో స్థానికులు చెరువులో దిగి గాలించారు. తేజను చెరువు ఒడ్డుకు చేర్చారు. అప్పటికే తేజ మృతి చెందాడు. ఇదిలా ఉండగా తేజ తండ్రి లక్ష్మణరావు రెండేళ్ల కిందటే మృతి చెందాడు. దీంతో తల్లి జయలక్ష్మి బోరున విలపిస్తోంది. భర్త చనిపోయి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు తేజపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తున్నానని రోదిస్తోంది. ఇక తాను ఎవరి కోసం జీవించాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆమె రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.

Advertisement
 
Advertisement
Advertisement