విజయనగరం గంటస్తంభం: తమ సమస్యలు చెబుతామని వస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. అకారణంగా సస్పెండ్ చేస్తున్నారని గ్రామ, వార్డు సర్వేయర్లు ఆందోళనకు దిగారు. అధికారులు తమపై ఒత్తిడి పెంచుతున్నారని సమస్యలు చెబుదామంటే వినకుండా తిరిగి తమపై చర్యలు తీసుకుంటున్నారని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రభుత్వం మారిన తరువాత సర్వే పనులతో పాటు అనేక రకాల అదనపు సర్వేలు, ఇతర పనులు అప్పగిస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనాలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వచ్చిన సందర్భంలో సర్వేయర్ల యూనియన్‌కు చెందిన ఇద్దరు గ్రామ సచివాలయ సర్వేయర్లను సస్పెండ్ చేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. డెంకాడ మండలం డెంకాడ గ్రామ సచివాలయ సర్వేయర్ జి.లక్ష్మీప్రసాద్, నెలిమర్ల మండలం బూరాడపేట గ్రామ సచివాలయ సర్వేయర్ జి.శరత్‌లను ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే టి.యజ్ఞేశ్వరరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది కాస్త సర్వేయర్ల ఆందోళనకు దారి తీసింది.
● ప్రశ్నిస్తే శిక్షా...?
కలెక్టరేట్ వద్ద ఆందోళనలో సర్వేయర్లు మాట్లాడుతూ యూనియన్‌లో ఉన్న ఇద్దరిని లక్ష్యంగా చేసుకుని సస్పెండ్ చేయడం ద్వారా మిగతా సర్వేయర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. తమ కష్టాలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా ఇలా హింసించడం ఎంత వరకు న్యాయమని నిలదీశారు. తమ అసలు పని భూముల సర్వే చేయడమేనని, అయినా ఇతర శాఖలకు సంబంధించిన అనేక పనులు కూడా అప్పగిస్తున్నారని తెలిపారు. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ఉద్యోగం చేయడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పెరిగినా.. వేతనాలు మాత్రం పెరగలేదని వాపోయారు.
సస్పెన్షన్లు ఎత్తేయాలి..
తమ యూనియన్‌కు సంబంధించి ఇద్దరు సర్వేయర్లపై వేసిన సస్పెన్షన్ వేటును తక్షణమే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల చర్యలు తమలో భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సర్వేయర్లు హెచ్చరించారు. అంతకు ముందు ఉన్నతాధికారులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కలెక్టరేట్ ముందు సర్వేయర్ల ధర్నా
సమస్యలు చెప్పనీయకుండా గొంతు
నొక్కేస్తున్నారు..
అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నాం..
తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం..


