మహిళా దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళా దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు : కలెక్టర్‌

Mar 7 2026 9:32 AM | Updated on Mar 7 2026 9:32 AM

విజయనగరం ఫోర్ట్‌: పోలీసు బ్యారెక్స్‌లో ఈ నెల 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. అధికారులతో ఆయన శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలను దృష్టిలో ఉంచుకుని జిల్లా, మండల స్థాయి వేదికల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను, మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. అంబులెన్స్‌ వాహనాలను, అత్యవసర మందులను వీలైతే మహిళ వైద్యులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్‌, తాగునీరు ఏర్పాట్లును మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీఓలు చూడాలన్నారు. విద్యుత్‌ సరఫరా నిరంతరం జరిగేలా విద్యుత్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైద్య కళాశాలలో పీజీ అకడమిక్‌సెల్‌ ప్రారంభం

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంఽధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అకడమిక్‌ సెల్‌ను ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.దేవి మాధవి శుక్రవారం తెలిపారు. అకడమిక్‌ సెల్‌ చైర్మన్‌గా డాక్టర్‌ కె.వెంకటాచలం, పోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌గా డాక్టర్‌ కె.శారద వ్యవహరిస్తారని తెలిపారు.

డీఆర్‌ఓగా సత్తిబాబు

విజయనగరం కలెక్టరేట్‌: జిల్లా రెవెన్యూ అధికారిగా సి.హెచ్‌.సత్తిబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశాఖపట్నం హౌసింగ్‌ పీడీగా పని చేస్తూ ఇక్కడకు వచ్చారు. ఇక్కడ ఇంతకు ముందు పని చేసిన శ్రీనివాసరావు జనవరి నెలలో ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కేసీఆర్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఇ.మురళి అదనంగా బాధ్యతలు చూస్తున్నారు.

15లోగా సీఎస్‌సీ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్‌

పార్వతీపురం: జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌(సీఎస్‌సీ) పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ డా.ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తన కార్యాలయం నుంచి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంజినీరింగ్‌ అధికారి తమ రోజువారీ ప్రగతిని వివరించాలన్నారు. పనుల నిర్వహణలో ప్రతీ అధికారికి ఒక స్పష్టమైన ప్రణాళిక, వ్యూహం ఉండాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐటీడీఏ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం తప్పని సరిగా చేయాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సబ్‌కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవర్‌ స్వప్నిల్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణాంధ్ర–2047 క్యాలెండర్‌ ఆవిష్కరణ

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన స్వర్ణాంధ–2047 క్యాలెండర్‌ను కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలితో పాటు పలువురు అధికారులు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొరవ, సహకారంతో మన్యం జిల్లా ముందంజలో ఉందన్నారు.

జిల్లా ముందంజలో ఉండాలి

స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ప్రాధమిక రంగాల్లో పురోగతి కనిపించాలన్నారు. రాష్ట్ర స్థాయి డేటాను పరిశీలించి దానిని మండలాల వారీగా విశ్లేషించుకొని క్షేత్ర స్థాయి లక్ష్యాలను చేరుకొనేందుకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ప్రతీ జిల్లా అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ముస్తాబు గ్రామంగా తయారు చేయాలన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడానికి వినూత్నంగా ‘ఈ–టామ్‌టామ్‌’ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సమీక్షలో జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, డీఆర్‌ఓ హేమలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement