పార్వతీపురం అటవీ రేంజ్ పరిధిలో అగ్నిప్రమాద నివారణకు చర్యలు చేపడుతున్న అధికారులు
పాలకొండ రూరల్: అడవుల్లో సంచరించే వన్యప్రాణులు వేసవిలో వాటి మనుగడ కోసం అనేక సమస్యలు అధిగమించాల్సి ఉంటుంది. నీరు, ఆహారం కొరత వల్ల ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటాయి. మరోవైపు ఎండలకు చెట్లు, ఆకులు ఎండి రాలిపోతుంటాయి. కొందరు తమ స్వలాభాల కోసం అడవులను తగలబెట్టం పరిపాటిగా మారింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. సమీపంలో జీవించే జీవరాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో వన్యప్రాణులు తమ దాహార్తిని తీర్చుకోవడానికి, కడుపు నింపుకోవడానికి జనావాసాల వైపు అడుగులు వేస్తుంటాయి. ఏనుగుల గుంపులు జనావాల్లోకి తరచూ వస్తుండడమే ఇందుకు నిదర్శనం.. దీనిని ఆసరాగా చేసుకుని వేటగాళ్లు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఫైర్ లైన్స్.. ఫైర్ బ్లోయర్స్..
అడవిలో అగ్ని ప్రమాదాలు తలెత్తే సమయంలో వాటిని అధిగమించేందుకు 3 మీటర్ల వెడల్పులో గడ్డిని చెక్కి ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫైర్ బ్లోయర్ అనే ప్రత్యేక పరికరాలు వినియోగించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయనున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మానటరింగ్ సెల్‌లో అడవికి సంబంధించి ఒక కోడ్‌ను నమోదు చేస్తారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేపట్టారు.
20 చోట్ల నీటి కుంటలు..
వేసవిలో వన్యప్రాణులు తాగునీటి సమస్యతో మృత్యువాత పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చుక్కల దుప్పులు, అడవి మేకలు, కుందేళ్లు, తదితర జీవాలు దాహార్తిని తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వస్తూ ప్రమాదాలకు గురికావడం, మృత్యువాత పడడం జరుగుతుంది. దీనిని అధిగమించేందుకు కనీస నీటివసతి లేని ప్రాంతాల్లో 20 చోట్ల సాసర్పిట్లు (నీటి కుంటలు) ఏర్పాటు చేశారు. నీటి కోసం వచ్చే జంతువులకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయి. కుంటల్లో నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంక్లతో నీటిని నింపుతున్నారు.
భద్రతకై నిఘా..
జీవరాశుల కదిలికలు ఎక్కువగా ఉన్నచోట, దాహార్తిని తీర్చుకునే ప్రాంతాల్లో భద్రతకు ప్రాధాన్యత కల్పించారు. వేటగాళ్ల ఉచ్చులకు చిక్కకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు వారాలకోసారి వీటిని పరిశీలిస్తున్నారు. నిరంతరం ఈ కెమెరాల ద్వారా అటవీ ప్రాంతానికి విజుబుల్ రక్షణ అందిస్తుంది. గతేడాది చివరి నుంచి ప్రత్యేక యాప్ సహాయంతో జీవాల కదలికలు, వాటి ఆనవాళ్లు గుర్తించి ఫొటోలు తీసి విశ్లేషిస్తున్నారు. అడవి పందులు, కుందేళ్లు, పునుగు పిల్లులు, చుక్కల దుప్పులు, అడవి మేకలు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు.
స్వీయ పర్యవేక్షణ..
ఉన్నతాధికారుల సూచనలతో జిల్లాలోని నాలుగు రేంజ్‌లలో మా సిబ్బంది అడవి జంతువులు, వన్యప్రాణుల రక్షణకు స్వీయ పర్యవేక్షణ చేపడుతున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా.. జీవాల దాహార్తి తీర్చేలా.. వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అటవీ సంరక్షణకు ప్రజాల సహకారం అవసరం.
– జీఏపీ ప్రసూన,
జిల్లా అటవీ శాఖాధికారి, పార్వతీపురం మన్యం
1,07,721 హెక్టార్లలో..
మన్యం జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలో 1,07,721 హెక్టార్ల వరకు అడవులు విస్తరించి ఉన్నాయి. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో చింతపండు, విప్పపువ్వు, జీడిపిక్కలు, కొండ మామిడి, ఇతర అటవీ ఫలసాయం సేకరణకు పలువురు అడవుల్లో సంచరిస్తుంటారు. వీరిలో కొంతమంది అనుకోకుండా చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి.


