రామభద్రపురం: మండలంలోని బాడంగి రూట్‌లో ఎస్సై వి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టగా.. ఇద్దరు వ్యక్తులు రెండున్నర కిలోల గంజాయితో పట్టుబడ్డారు. ఈ మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి కుమ్మరివీధికి చెందిన గొండేల దిలీప్, గరివిడి మండలం బాగువలసకు చెందిన నడిమింటి అఖిల్ మరికొంతమందితో కలిసి సుమారు మూడేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. వీరు గంజాయికి బానిసలు కావడంతో పాటు మరికొంతమందికి విక్రయిస్తున్నారు. ఒడిశాలోని సుంకి నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు తనిఖీలు చేపట్టగా దిలీప్, అఖిల్ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. గొండేల దిలీప్‌పై పెదమానాపురం పోలీస్‌స్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణాపై గతంలో కేసు నమోదైంది.
జాతీయ విలువిద్య పోటీల్లో గిరిజన క్రీడాకారుల ప్రతిభ
పార్వతీపురం రూరల్: కేరళలో ఇటీవల నిర్వహించిన 38వ తలక్కల్ చందు మెమోరియల్ జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. విజేతలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి శుక్రవారం తన చాంబర్‌లో అభినందించారు. ఈ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపిక కాగా.. మహిళల విభాగంలో పువ్వల వసంత తృతీయ బహుమతి సాధించారు. మరో క్రీడాకారుడు దంగభద్ర పవన్‌కుమార్ కూడా విజేతగా నిలిచారు. గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి విజయాలు దోహదపడతాయని పీఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎ. విజయశాంతి, ఏపీఓ ఎ.మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎస్సీ కమిషన్ సభ్యుడి రాక
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం శనివారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం. శ్యామల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
సంతకవిటి: గడ్డిమందు తాగిన మహిళ చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మామిడిపల్లి గ్రామానికి చెందిన టి. లక్ష్మి (60) గురువారం రాత్రి పొరపాటున ఇంటిలో ఉన్న గడ్డిమందు తాగేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రాజాంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతురాలి కుమార్తె రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణపల్లికి చెందిన వృద్ధురాలు..
పార్వతీపురం రూరల్: గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణపల్లి పంచాయతీకి చెందిన పోరాపు తెరీజమ్మ (81) ఫిబ్రవరి 28న పింఛన్ తీసుకుంది. అదేరోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడి ఫించను నగదుతో పాటు ఇంట్లో ఉన్న మరికొంత నగదు దోచుకునే క్రమంలో వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన తెరీజమ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. క్లూస్ టీమ్ ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 4న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


