రేగిడి: జలవనరుల శాఖలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీనియార్టీ జాబితా తయారుచేసి ఉద్యోగోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శాసనమండలిలో శుక్రవారం కోరారు. మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. జోన్ –1, జోన్ –4లకు సంబంధించి వాటర్ రిసోర్స్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. 1975లో వెనుబడిన ప్రాంతాల అభ్యున్నతికి రాష్ట్రాన్ని నాలుగు జోన్‌లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ, పదోన్నతులు ఆ ప్రాంత ప్రజలకు, ఉద్యోగులకు వర్తించేలా ఉత్తర్వులు జారీచేయడం జరిగిందన్నారు. ఈ ఉత్తర్వుల వల్లే వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. 1975 నుంచి ఈ ఉత్తర్వులు అన్నిశాఖల్లో అమలులో ఉన్నాయన్నారు. 2017లో గత ప్రభుత్వం 6 పాయింట్ ఫార్ములా ఫ్రెసిడెన్సియల్ ఆర్డర్‌ని తుంగలోకి తొక్కి, సుమారు 50 మంది ఉత్తరాంధ్ర ఇంజినీర్లను రివర్స్ చేసిందన్నారు. ఇది కేవలం జలవనరులశాఖలో మాత్రమే జరుగుతోందని సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన ఇంజినీరింగ్ అధికారులు హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీల్ చేయగా, హైకోర్టులో 2019లో జడ్జిమెంట్ వచ్చిందనన్నారు. ఆ తీర్పు ప్రకారం 2017లో ఇచ్చిన అడ్డగోలు ప్రమోషన్లు రద్దుచేసి, రాజ్యాంగం ప్రకారం జోనల్ సిస్టమ్, సీనియార్టీ జాబితాలు తయారు చేసి ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
శాసనమండలిలో ఎమ్మెల్సీ విక్రాంత్


