విజయనగరం గంటస్తంభం: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన కార్మికులు వినియోగించుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారులు సూచిస్తున్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివాహం, ప్రసూతి, సహజ మరణం, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించే పథకాలను అమలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఉపాధి హామీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టీలలో పని చేసే వారు, రాయి పనులు చేసే వారు, వెల్డర్లు తదితరులు రూ.110 చెల్లించి ఐదు సంవత్సరాలకు కార్మికులుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
రెన్యువల్‌కు మరో అవకాశం
2019 నుంచి 2025 వరకు కార్డు రెన్యువల్ చేయించుకోని కార్మికులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రూ.110 చెల్లించి కార్డులను రెన్యువల్ చేసుకోవాలని కార్మిక శాఖ అధికారులు సూచించారు. కార్డు రెన్యువల్ చేసుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.
వివాహ కానుకగా రూ.40 వేల సాయం
భవన నిర్మాణ కార్మికుల పిల్లల వివాహాలకు ప్రభుత్వం రూ.40 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. కార్మికుడికి లేబర్ కార్డు ఉండి వివాహ సమయానికి రెన్యువల్ అయి ఉండాలి. ఏపీ సేవా పోర్టల్ నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకొని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా నకలు కాపీలతో కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. 2026 మార్చి నుంచి జరిగే వివాహాలకు ఈ పథకం వర్తిస్తుంది.
జిల్లాలో 90వేల కార్మికుల నమోదు
ఇప్పటి వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 90 వేల మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మీసేవా కేంద్రాలు, గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోని ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కార్మికులకు అవగాహన
దీనికి సంబంధించి కార్మికుల్లో అవగాహన పెంపొందించేందుకు కార్మిక శాఖాధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇటీవల విజయనగరం పెద్ద చెరువు వద్దనున్న దివంగత వైఎస్సార్ విగ్రహం వద్ద పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సభ్యత్వ నమోదు విధానం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. జిల్లా కార్మిక శాఖ కమిషనర్ ఎస్‌డీవీ ప్రసాదరావు, ఏఎల్‌ఓ జీఎస్‌ఎస్‌కే శ్రీనివాసరావు, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ బి.రమాదేవి, సిబ్బంది అవగాహన కల్పించిన వారిలో ఉన్నారు.
18 – 60 ఏళ్ల కార్మికుల నమోదుకు సువర్ణావకాశం
రూ.110తో నమోదు..కార్మికులకు అనేక సంక్షేమ ప్రయోజనాలు
లేబర్ కార్డు ఉంటే పెళ్లి, ప్రసూతి,
మరణానికి ఆర్థిక సాయం
రెన్యువల్ చేసుకోని కార్మికులకు
మరో అవకాశం
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 90 వేల మంది కార్మికుల నమోదు
ప్రసూతి సాయం
భవన నిర్మాణ కార్మికుల కుమార్తెలకు రెండు కాన్పులకు ప్రభుత్వం రూ.20 వేల చొప్పున సాయం అందజేస్తుంది. ఆస్పత్రి ప్రసూతి ధ్రువపత్రం, డిశ్చార్జి సర్టిఫికెట్, శిశువు జనన ధ్రువపత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.
సహజ మరణానికి రూ.60 వేల సాయం
నమోదైన కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి ప్రభుత్వం రూ.60 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. మరణ సమయానికి కార్డు రెన్యువల్ అయి ఉండాలి. మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేయాలి.
దహన సంస్కారాలకు తక్షణ సాయం
మరణించిన కార్మికుడి దహన సంస్కారాల కోసం ప్రభుత్వం రూ.20 వేల తక్షణ సాయం అందజేస్తుంది. సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.


