● చోరీ సొత్తులో 470 గ్రాముల రికవరీ
● పోలీసుల అదుపులో ఇద్దరు
● పరారీలో మరో ఇద్దరు
● ఏఎస్సీ సౌమ్యలత వెల్లడి
విజయనగరం క్రైమ్ : రాజాం జీఎంఆర్ క్వార్టర్స్‌లోని రెండిళ్లలో గత నెల 1వ తేదీన జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు, వారి నుంచి 470 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. స్థానిక డీపీఓలోని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. రాజాం జీఎంఆర్ క్వార్టర్స్‌లో జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ నగేష్ దసర్వార్, జీఎంఆర్ ఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గడ్డం మాధవ కృష్ణారెడ్డి ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫిబ్రవరి 1న చోరీకి పాల్పడ్డారని చెప్పారు. ఒక ఇంట్లో 1279 గ్రాముల బంగారు ఆభరణాలు, మరో ఇంట్లో 245 గ్రాముల ఆభరణాలు దొంగిలించుకుపోయినట్టు అందిన ఫిర్యాదుల మేరకు సంతకవిటి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారన్నారు. వీటిని ఛేదించేందుకు సీసీఎస్ పోలీసుల సహకారంతో నలుగురు ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో 12 మంది ఎస్‌ఐలతో ఐదు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను ట్రాక్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సాంకేతికతతో సీసీటీవీ పుటేజ్‌తో చోరీకి పాల్పడిన వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించామని తెలిపారు. ఆ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ధార్ జిల్లాకు వెళ్లాయన్నారు. గ్యాంగ్‌లోని ఇద్దరు నిందితులైన ధార్ జిల్లా సర్దార్పూర్ తహశీల్, ధకన్బారికి చెందిన రక్ష ఉరఫ్ రాక్‌సింగ్(36), ఖనియాంబాకు చెందిన మోహన్‌సింగ్ దౌదావే(28)లను పట్టుకున్నామని తెలిపారు. ఈ ఇద్దరూ మళ్లీ దొంగతనం చేసేందుకు రాజాం వచ్చినట్టు అందిన సమాచారంతో బూరాడపేట జంక్షన్ వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి సుమారు రూ.70 లక్షల విలువ చేసే 470 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయని, వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు, సీసీ ఎస్ ఎస్‌ఐ కె.లక్ష్మణరావు, సంతకవిటి ఎస్‌ఐ ఆర్.గోపాలరావు, హెడ్ కానిస్టేబుళ్లు ఇమ్రాన్ఖాన్, డి.శంకరరావు పాల్గొన్నారు.


