పీహెచ్‌సీలపై ‘కూటమి’ కన్నెర్ర ప్రజారోగ్యానికి గత ప్రభుత్వం పెద్దపీట ఎస్.కోట నియోజకవర్గం పరిధిలో
పీహెచ్‌సీల భవన నిర్మాణాలకు ప్రాధాన్యం
రూ.8.25 కోట్లు మంజూరు
అప్పట్లో చకచకా సాగిన నిర్మాణాలు
చంద్రబాబు సర్కారు వచ్చాక నిర్లక్ష్యం
పరాయిపంచన ప్రభుత్వాస్పత్రులు
పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
దారుణం
కొత్తవలస:
ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం కినుకవహిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తోంది. అసంపూర్తిగా ఉన్న ఆస్పత్రి భవన నిర్మాణాలు పూర్తిచేయడంలో జాప్యం రోగులకు శాపంగా మారింది. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీటవేసింది. ఎస్.కోట నియోజకవర్గం పరిధిలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఐదు పీహెచ్‌సీలకు నూతన భవనాల నిర్మాణానికి రూ 8.25 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో పనులు చకచకా సాగాయి. సుమారుగా 60 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయాయి. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఆధారమైన భవనాలు పిచ్చిమొక్కల నడుమ దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ తీరును ఎత్తిచూపుతున్నాయి.
ఇదీ పరిస్థితి...
నియోజకవర్గంలోని జామి, అలమండ, లక్కవరపుకోట, కొత్తవలస, వియ్యంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. దీంతో గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చొరవతో ఐదు పీహెచ్‌సీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవ న నిర్మాణాన్ని రూ.కోటి65లక్షల వ్యయంతో తలపెట్టారు. రోగులకు వైద్యసేవలందించేందుకు వీలుగా విశాలమైన వార్డులు, వైద్యులకు ప్రత్యేక గదులు, ఓపీ విభాగం, లేబొరేటరీ ఇలా.. ఆధునిక సదుపా యాలతో భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఈ భవనాల పూర్తిచేయడంలో ప్రస్తుత కూటమి ప్రభు త్వ నిర్లక్ష్యం రోగులకు ఇబ్బందులు కలిగిస్తోంది.
పరాయి పంచన ఆస్పత్రులు..
ప్రస్తుతం కొత్తవలస పీహెచ్‌సీ చెంతనే గల ఎన్‌జీఓ కార్యాలయంలోను, వియ్యంపేట పీహెచ్‌సీ సాంఘీక సంక్షేమ హాస్టల్‌లో నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు సరైన సౌకర్యాలు లేవు. మంచాలు లేకపోవడంతో బల్లలపైనే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. చీకటి గదుల్లోను మందులను దాచుకునే దుస్థతి నెలకొంది. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్షను వీడి ప్రజారోగ్యానికి అవసరమైన పీహెచ్‌సీ భవన నిర్మాణాలపై శ్రద్ధ చూపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అసంపూర్తి నిర్మాణాలపై ఇంజినీరింగ్ అధికారి ఇ.శ్రీనివాసరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కొద్దిపాటి బిల్లులు పెండిగ్‌లో ఉండడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని, బిల్లులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఆస్పత్రి భవనాల నిర్మాణా లు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే గత ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్ల రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– పల్లా భీష్మ, చింతలపాలెం మాజీ సర్పంచ్, కొత్తలస మండలం
కూటమి ప్రభుత్వం ప్రజా రోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం కొత్తవలస ప్రజానీకానికి ప్రభుత్వ వైద్యసేవలు అందని ద్రాక్షగా మారిపోయాయి. ఇప్పటిౖకైనా పాలకులు కళ్లుతెరిచి భవన నిర్మా ణాలు పూర్తిచేసి పేదప్రజలకు మెరుగైన వైద్యసేవలందేలా చూడాలి.
– వెంకన్నపాత్రుడు, కొత్తవలస


