విజయనగరం ఫోర్ట్: మిషన్ హార్టివిజన్ అమలుచేసి ఉద్యాన పంటల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. దీనికోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రభుత్వశాఖల సమన్వయంతో సమష్టిగా కృషిచేయడం ద్వారా దీనిని సాధించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మసేద్యం, డీఆర్‌డీఏ, విద్యుత్, మార్కెటింగ్‌శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి పంటకు బదులు ఉద్యాన పంటలను సాగు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక మిషన్‌ను రుపొందించినట్టు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌లో 6 వేల ఎకరాల్లో అదనంగా వివిధ ఉద్యాన పంటల సాగు చేపట్టడం మిషన్ లక్ష్యమని పేర్కొన్నారు. కనీసం ఐదు ఎకరాలు ఒక క్లస్టర్‌గా రుపొందించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, ఉద్యానశాఖాధికారి చిట్టిబాబు, మార్కెటింగ్‌శాఖ ఏడీ రివికిరణ్, ప్రకృతి వ్యవసాయం మేనేజర్ ఆనందరావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి, తదితరులు పాల్గొన్నారు.


