● జిల్లా అగ్నిమాపక అధికారి
సింహాచలం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని మందుగుండు త యారీ కేంద్రాల్లో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల మందుగుండు తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని పార్వతీపురం మండలం తాళ్లబురిడిలోని అగ్ని గంగమ్మ ఫైర్ వర్క్స్.. పాచిపెంట మండలం శ్యామలగౌరీపురంలోని అమూల్య మేఘన ఫైర్ వర్క్స్.. సీతానగరం మండలం సుభద్ర గ్రామంలోని రుగడ పోలమాంబ ఫైర్ వర్క్స్ కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దుకాణం వద్ద ఫైర్ ఎగ్జిట్ డోర్లు, ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా బాల కార్మికుల నిర్మూలన అధికారి సువర్ణ పాల్గొన్నారు.


