● జంతు కళేబరాలతో నదీ జలాలు
కలుషితం
● పెదవి విప్పని ప్రజాప్రతినిధులు
● గోవధపై స్పందించని సంఘాలు
శృంగవరపుకోట: హిందువుల ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే గోమాతను నిర్దయగా వధిస్తూ వ్యాపారం చేస్తున్న ఉదంతం గోపాలపల్లి సాక్షిగా సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. గ్రామంలో కొందరు పెద్దలు, ఉద్యోగుల మద్దతుతో సాగుతున్న గోవధను గ్రామస్తులు ఆదివారం బయటపెట్టారు. ఈ ఘటనపై జిల్లాస్థాయి అధికారులు స్పందించకపోవడం, చట్టవ్యతిరేక వ్యాపారానికి కొమ్ము కాసిన వారిపై చర్యలకు ఉపక్రమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ అనుమతులు లేకుండా గ్రామంలో గొర్రెల ఫారం ఎలా ఏర్పాటైంది? తొలుత పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సర్పంచ్‌లు అడ్డుకున్న షెడ్ నిర్మాణం తర్వాత ఎలా పూర్తయ్యింది..? పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సచివాలయ ఉద్యోగులకు తెలియకుండానే ఐదు నెలలుగా గోవధ జరుగుతోందా? గోవుల కళేబరాలను గోస్తనీ తీరంలో ఖననం చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదు..? ఇంటికోసం తీసుకున్న విద్యుత్ కనెక్షన్‌తో గొర్రెల ఫారం నడుపుతున్నా విద్యుత్‌శాఖ ఎందుకు మౌనం దాల్చింది..? గోవధలో సూత్రధారులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు పారిపోయిన పాత్రధారులు ఐదుగురిని ఎప్పుడు పట్టుకుంటారు..? అన్న ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. అందరికీ అన్ని స్థాయిల్లో పెద్ద మొత్తంలో సొమ్ములు చేతులు మారడంతోనే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని విమర్శిస్తున్నారు. నదిలోని చెలమల నుంచి తెచ్చుకున్న నీటినే తాగునీరుగా వినియోగిస్తున్నామని, నదిలో గోవుల కళేబరాలను ఖననం చేయడం, విచ్చలవిడిగా పడేయడం తగదని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన సూరీడమ్మ, ఉష, నారాయణమ్మ తదితరులు సోమవారం డిమాండ్ చేశారు. లేదంటే జిల్లాస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


