ఏనుగుల తరలింపునకు ముమ్మర ఏర్పాట్లు
● చురుగ్గా ఏనుగుల సంరక్షణ కేంద్రం పనులు
సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో దీర్ఘకాలంగా పలు గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులను కొండ ప్రాంతాలకు తరలించడానికి అటవీశాఖ ఉన్నతాధికారులు చేస్తున్న పనులు పూర్తి కావొచ్చాయి. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతాల్లోనున్న కుంకి ఏనుగుల రాక కోసం గుచ్చిమి వద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత గుచ్చిమి బీట్ వద్ద సంచరిస్తున్న ఏనుగులను మచ్చిక చేసుకుని తరలించడానికి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని రెండు దశాబ్దాలుగా సంచరిస్తూ పంట, ప్రాణ నష్టం కలిగిస్తున్న ఏనుగుల గుంపును దూరప్రాంత కొండలకు (చిత్తూరులో వన్యమృగాల సంరక్షణా కేంద్రానికి) తరలించడానికి పార్వతీపురం రేంజ్ గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్‌లో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్పయ్యపేట, రేపటివలస, గుచ్చిమి, జోగింపేట గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులు జనావాసాల్లోకి రాకుండానిరోధించేందుకు అత్యాధునికమైన ఏనుగు నిరోధక కందకాలు, పోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పట్టుబడిన ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ షెడ్లు, వాటర్‌టబ్‌ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అలాగే మావటిల కోసం ప్రత్యేక క్వార్టర్లు, కిచెన్ షెడ్లు, ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక వెటర్నరీ కేర్ సెంటర్ (వైద్య కేంద్రం), అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్వతీపురం ప్రాంతంలో గత పదేళ్లలో మానవ, వన్యప్రాణి సంఘర్షణల వల్ల 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 9 ఏనుగులు మృతి చెందాయి. ఈ పరిస్థితుల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగుల గుంపును సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు.
ఏనుగుల తరలింపునకు ముమ్మర ఏర్పాట్లు


