వృద్ధురాలిపై దాడి
పార్వతీపురం రూరల్: పింఛన్ సొమ్ము కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిపై దాడి చేసిన సంఘటన మండలంలోని కృష్ణపల్లి పంచాయతీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోరాపు తెరీజమ్మ (81) ప్రభుత్వం అందజేసిన పింఛన్ సొమ్మును శనివారం తీసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న ఆమైపె అదే రోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. నగదు కాజేసే క్రమంలో ఆమె తలపై బలంగా గాయపరిచారు. ఆదివారం ఉదయం రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని తొలుత స్థానిక ప్రభుత్వాస్పత్రికి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఐ రంగనాథం, ఎస్సై రాజేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు.


