పావలా కోడికి రూపాయి మసాలా..!
రూ.4వేల పింఛన్ పంపిణీకి రూ.2కోట్ల ఖర్చు..!
● పెన్షన్ పంపిణీకి ఇంత బిల్డప్ అవసరమా అధ్యక్షా..?
● ఫొటో షూట్లు.. డ్రామా పలకరింపులు
● చీపురుపల్లిలో బాబు పర్యటన ఆద్యంతం ఒక కామెడీ స్కిట్
● వ్యాక్సినేషన్ పేరుతో రాజకీయ ప్రచారం
చంద్రబాబు మాట్లాడుతుండగా సభ నుంచి వెళ్లిపోతున్న జనం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఏమీ తోచనమ్మ అర్ధరూపాయి విలువైన ఆకుచెక్క ఇవ్వడానికి అరవై మైళ్లు వెళ్లొచ్చిందట... అలా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం అన్నది జనం నుంచి వినిస్తున్న మాట. ప్రతినెలా ఏదో ఒక నెపంతో జిల్లాల పర్యటనకు వెళ్తున్న చంద్రబాబునాయుడు ఆయా జిల్లాలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమిటి? వాటి అమలు ఏ స్థాయిలో ఉందన్నదానిమీద ఎలాంటి కసరత్తు చేయకుండానే నేరుగా వచ్చేస్తున్నారు. ప్రజల జ్ఞాపకశక్తి సన్నగిల్లిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వాళ్లకు గుర్తు లేదని.. మళ్లీ తాను జిల్లాలకు వెళ్లి కాస్త షో చేస్తే సరిపోతుందన్న భావనలో ఉన్న చంద్రబాబు ఏమాత్రం మొహమాటం లేకుండా గ్రాండ్‌గా పర్యటనలు చేస్తున్నారన్న గుసగుసలు చీపురుపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజావేదికలో కనిపించాయి.
● అంతా షో...
ప్రతినెలా ఒకటో తేదీన ఏదో జిల్లాకు వెళ్లడం.. ఎంపిక చేసి, ట్రైనింగ్ ఇచ్చిన కొద్దిమంది పెన్షన్‌దారులకు డబ్బులు చేతిలో పెట్టి అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన వీడియో గ్రాఫర్లతో వీడియో షూట్ చేయడం.. అదే ఇంట్లో కాఫీచేసి ఇస్తున్నట్లు నాలుగు ఫొటోలు జనంలోకి వదులుతూ తానూ ప్రజలకు దగ్గరయ్యానని చెప్పుకునేందుకు తాపత్రయ పడడం. అంతా ముందు అనుకున్నట్లుగా స్కిట్ చేసేసి టింగురంగా అనుకుంటూ మళ్లీ విజయవాడ వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాక కోసం వారం ముందు నుంచే అధికారుల ఏర్పాట్లు.. జనాన్ని బలవంతంగా రప్పించడానికి ఏయే శాఖలను అందులో భాగస్వాములను చేయాలనే అంశంపై జిల్లా అధికారుల్లో ఒక చర్చ. జిల్లా అధికారులు రెండుమూడుసార్లు ఆ సభావేదికను పరిశీలించడం.. ఈ జనాన్ని సభ వద్దకు తరలించడానికి పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల వినియోగం.. వీళ్లంతా ఎండల్లో మరిగిపోతూ అటుఇటు ప్రయాణం. దీంతోబాటు బందోబస్తు నిమిత్తం ఇరుగుపొరుగు జిల్లాల నుంచి పదుల సంఖ్యలో పోలీస్ సిబ్బంది తరలింపు.. ఇదంతా ఎంత ఖర్చు.. ఎన్ని కోట్ల ప్రజాధనం వృధా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. ఒక్కరికై నా కొత్తపింఛన్ మంజూరు చేయని సీఎం పర్యటనల పేరుతో ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై జనం మండిపడుతున్నారు. లబ్ధిదారులు ఆయన వాహనశ్రేణివైపు చూస్తూ... బాబు ప్రచార డాబునూ చూస్తూ ముక్కనవేలేసుకుని ఉండిపోతున్నారు. పెళ్లిని ఘనంగా చేసుకుంటారు కానీ ప్రతినెలా పెళ్లిరోజును ఎవరైనా అంత ఘనంగా చేసుకుంటారా అనే ప్రశ్నకు.. డబ్బు మనది కాకపోతే ప్రతి నెలా ఏమి ఖర్మ. ప్రతిరోజూ రూ.లక్షలు, రూ.కోట్లు తగలేసి సంబరాలు చేసుకుంటారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నడ్డి నాది కాకపోతే కాశీదాకా అయినా దేక్కుంటూ పోతాను.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా... పింఛన్ల పంపిణీని మాత్రం ఘనతగా చెప్పుకుంటూ ప్రతినెలా రాజకీయ సభలు నిర్వహించడం.. సెల్ఫ్ డప్పు కొట్టుకుంటూ సెలబ్రేషన్స్ చేస్తుండడాన్ని చూసి జనం నిశ్చేష్టులవుతున్నారు. అధికారం కట్టబెట్టాం.. మరో మూడేళ్లు భరించాల్సిందే అంటూ కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
బాబు గారూ... బోరు కొడుతోంది....
సీఎం ప్రసంగం మధ్యలోనే లేచి
వెళ్లిపోయిన జనం
ఖాళీయిన కుర్చీలు
మంత్రి కొండపల్లిని మాజీ మంత్రి
అంటూ సీఎం సంబోధన
ఊరొచ్చి ఉసూరుమనిపించారంటూ తమ్ముళ్ల ఆవేదన
వేదికపై కనిపించని గ్రామ సర్పంచ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున
నాటి పారదర్శకత నేడు ఏదీ?
గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సింపుల్‌గా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందించి వచ్చేవారు. ఇన్ని కామెడీ స్కిట్లు.. రెడీమేడ్ ఆర్టిస్టులు లేరు.. డ్రామా లేదు. చంద్రబాబూ.. నువ్వే మా పెద్ద కొడుకువు అంటూ కన్నీళ్లు తుడుచుకునే కుటుంబం లేదు. మీకు నేనున్నాను.. మీ కష్టాలు తీరుస్తా... అనే డైలాగులు సైతం ఆ ఐదేళ్లు వినిపించలేదు. కానీ ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. ప్రతి పేదవాడి ఇంటా చిరునవ్వు విరిసింది. అప్పట్లో ఇన్ని డ్రామాలు.. భావోద్వేగ సన్నివేశాలు లేవు. స్వచ్ఛమైన ప్రభుత్వ సేవ మాత్రమే సమాజంలో కనిపించేది. కానీ నేడు ప్రజలకు దక్కేది పావలా అయితే ప్రచారం మాత్రం రెండురూపాయలు దాటుతోందని అధికారులు.. సామాన్య జనం సైతం లోలోన గుసగుసలాడుతున్నారు.
చీపురుపల్లి: ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి అంటూ చెబుతుంటారు.. మన ప్రాంతానికి వచ్చారు.. ఏం వరాలు ఇస్తారో.. అభివృద్ధి కోసం ఎంతెంత నిధులు విదుల్చుతారో అంటూ వచ్చిన చీపురుపల్లి ప్రాంత ప్రజలకు చేదు అనుభవమే ఎదురైంది. కనీసం ముఖ్యమంత్రి ప్రజావేదిక నిర్వహించిన రావివలస పంచాయతీ పైలపేట గ్రామానికై నా ఏదోఒకటి ప్రకటిస్తారని ఎదురు చూసిన గ్రామస్తులకు నిరాశ తప్పలేదు. ముఖ్యమంత్రి మా ఊరి వచ్చి ఏం ప్రయోజనం కనీసం ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదంటూ సాక్షాత్తూ అదే పార్టీకు చెందిన ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ అసహనం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి పాతపాటే పాడడంతో వినే ఓపిక లేక ప్రసంగం మధ్యలోనే మహిళలు, కార్యకర్తలు లేచి వెళ్లిపోయారు. వెళ్లిపోతున్నవారిని వెలుగు సిబ్బంది నిలువరించినప్పటికీ ఆ మాటలు ఎంతకని వింటాం.. వినలేం బాబోయ్.. బైబై బాబూ అంటూ జారుకున్నారు. దీంతో సీఎం ప్రసంగం 30 నిమిషాలు దాటకముందే చాలా కుర్చీలు ఖాళీగా కనిపించాయి.
మాజీ మంత్రి అప్పలనాయుడు అంటూ...
వేదికపై ఉన్న వారి కోసం సీఎం చంద్రబాబు చెబుతూ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోసం మాట్లాడుతూ మాజీ మంత్రి అప్పలనాయుడు అంటూ సంబోధించడంతో వేదికపై ఉన్న వారు ముఖాలు చూసుకున్నారు. కేన్సర్ వ్యాధి కోసం మాట్లాడుతూ సర్వైకల్ కేన్సర్‌ను పలుమార్లు సర్వైవల్ కేన్సర్ అంటూ సీఎం మాట్లాడుతుంటే అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
రావివలస పంచాయతీ పరిధిలోని పైలపేటలో జరిగిన ప్రజావేదికపై ఆ గ్రామ సర్పంచ్ పనస మణికంఠ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునకు చోటు దక్కలేదు. ప్రజావేదికపై సర్పంచ్‌కు కుర్చీవేయకపోవడంపై ఆయన వర్గీయులు నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. నియోజకవర్గంలో టీడీపీను నిలబెట్టి ఆరేడేళ్లుగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న కిమిడి నాగార్జునకు వేదికపై స్థానం లేకపోవడంతో ఆయన వర్గీయులు రుసురుసలాడుతున్నారు.
పావలా కోడికి రూపాయి మసాలా..!
పావలా కోడికి రూపాయి మసాలా..!


