ఐటీడీఏ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ ఇలా..

Mar 1 2026 7:19 AM | Updated on Mar 1 2026 7:19 AM

ఐటీడీ

ఐటీడీఏ ఇలా..

ఐటీడీఏ ఇలా..

ఐటీడీఏను నిర్వీర్యం చేశారు..

ఐటీడీఏను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుంది. గిరిజన ప్రాంతాల్లో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. ఐటీడీఏకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనేది లేదు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల పథకాలు అమలు కాని పరిస్థితి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొండపోడు పట్టాలతో పాటు, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు.

– విశ్వాసరాయి కళావతి,

పాలకొండ, మాజీ ఎమ్మెల్యే

సీతంపేట: ఐటీడీఏ అంటే గిరిజనులకు అండగా ఉండి, వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ఐటీడీఏ రానురాను ఇటీవల కాలంలో ప్రాభవం కోల్పోతుంది. చంద్రబాబు సర్కార్‌ గద్దెనెక్కి 20 నెలలు కావస్తున్నా ఐటీడీఏకు దిశానిర్దేశం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో ప్రత్యేకంగా ఐటీడీఏకు పీఓలను శాశ్వతంగా నియమించింది. ఇన్‌చార్జ్‌లతో నడిపించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆన్‌చార్జ్‌ పీఓలతో నెట్టుకొస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్‌ మండలాలు ఉన్నాయి. 1250 వరకు గిరిజన గ్రామాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 16, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. రెండు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 13కు పైగా ప్రభుత్వ శాఖలు పని చేస్తున్నాయి. ఇంజినీరింగ్‌, గిరిజన సంక్షేమ శాఖ, వైద్య శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సహకార సంస్థ వంటివి నిర్వహించబడుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నప్పటకీ ఇప్పటి వరకు ఒక గవర్నింగ్‌ బాడీ సమావేశం కూడా నిర్వహించలేదు. పాలకవర్గ సమావేశాల ద్వారా గిరిజనులకు ఏఏ పథకాలు అవసరం, ఉన్న పథకాలు ఏమేరకు ఉపయోగపడుతున్నాయో.. క్షేత్ర స్థాయిలో పథకాల పనితీరు మంత్రులు, శాసనసభ్యులు చర్చించడానికి వీలుంటుంది. గవర్నింగ్‌ బాడీ సమావేశం కూడా ఇంతవరకు నిర్వహించకపోవడం గమనార్హం.

మౌలిక వసతులు అంతంతమాత్రమే...

గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖ ద్వారా రహదారులు, భవనాలు నిర్మించాల్సి ఉంది. 120కు పైగా గ్రామాలకు పూర్తి స్థాయిలో కనెక్టివిటీ దారులు లేవు. ఇప్పటికీ కొన్నిచోట్ల రహదారులు రాళ్లు తేలి ఉన్నాయి. చేసిన పనులకు సైతం బిల్లులు లేవంటూ సంబంధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రహదారి సౌకర్యాలు లేక అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించాలన్నా.. మార్కెట్‌కు అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్లాలంటే బాధలు వర్ణణాతీతం. ఇంకా వరద గోడలు, మల్టిపర్పస్‌ భవనాల నిర్మాణాలు పూర్తిగా లేవు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల పనులు పూర్తి కాలేదు. వైద్యసేవలు గగనం అవుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తుంది. కొన్ని పీహెచ్‌సీల్లో ఒక్కో డాక్టర్‌తోనే నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు సక్రమంగా జరగడం లేదు. మలేరియా నివారణలో భాగంగా దోమ తెరల పంపిణీ లేదు. వెఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2లక్షలకు పైగా దోమతెరలను గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేశారు. అటు తర్వాత పంపిణీ లేదు. అన్నదాత సుఖీభవ పథకం ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు 7వేల మందికిపైగా వర్తించలేదు. నిధులు బ్యాంకుల్లో జమకాక అవస్థలు పడుతున్నారు. గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. కొండచీపుర్లు, చింతపండు వంటి వాటికి సరైన మద్దతు ధరలు లేక గిరిజనులు అల్లాడుతున్నారు.

గిరిజన విద్యా సంస్థల్లో హెల్త్‌ వాలంటీర్‌లు లేరు...

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వాలంటీర్లు లేరు. ఐటీడీఏ పరిధిలో 60 గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో సుమారు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థినీ, విద్యార్థుల ఆరోగ్యాలను పరిరక్షించే ఏఎన్‌ఎంలు లేరు. అత్యవసర సమయాల్లో జ్వరం, ఇతర వ్యాధులు వస్తే విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కనీసం ప్రాధమిక చికిత్స చేసే వారు లేకపోవడంతో విద్యార్థులు దీనావస్థలో ఉన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదు. కాగా పాఠశాలలు పర్యవేక్షించే ఏటీడబ్ల్యూఓ పోస్టులు కూడా రెండు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకువస్తున్నారు. విద్యార్థులకు వండి వడ్డించే వంట సిబ్బంది కొరత కూడా ఉంది.

ఖాళీ అవుతున్న శాఖలు

నిర్వీర్యమవుతున్న సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ

గవర్నింగ్‌ బాడీ సమావేశాలు నిల్‌

క్షేత్ర స్థాయిలో పథకాల అమలు

అంతంతమాత్రమే..

ఖాళీ అవుతున్న శాఖలు

వెలుగు కార్యక్రమాలు సన్నగిల్లాయి. ట్రైబుల్‌ ప్రాజెక్టు మానటరింగ్‌ యూనిట్‌ను ఎత్తివేశారు. ఈ విభాగం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలను బలోపేతం చేయడం, వారికి జీవనోపాధి మార్గాలు చూపడం వంటివి చేసేవారు. ఏడాది కిందట ఆ శాఖను కూడా ఎత్తివేశారు. మానటరింగ్‌ చేసే ఏపీడీ పోస్టుతో పాటు ఏపీఎం పోస్టులు కూడా లేకుండా పోయాయి. అలాగే కొన్నేళ్ల క్రితం ఎస్‌ఎంఐ విభాగం శ్రీకాకుళం క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో కలిసింది. ఈ శాఖ ద్వారా గతంలో చెరువులు, చెక్‌డ్యాంలు వంటివి నిర్మించే వారు. తద్వారా ఖరీఫ్‌, రబీ పంటలకు సాగునీరు సక్రమంగా అందేది. పుష్కలంగా పంటలు పండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగునీరు గిరిజన ప్రాంతాల్లో గగనమైంది. రేపో, మాపో ట్రైబుల్‌ వెల్ఫేర్‌ డీడీ కార్యాలయం శ్రీకాకుళంకు తరలివెళ్లిపోనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందుకు అక్కడ ప్రత్యేక కార్యాలయాన్ని కూడా కలెక్టరేట్‌లో కేటాయించినట్టు తెలిసింది.

ఐటీడీఏ ఇలా..1
1/3

ఐటీడీఏ ఇలా..

ఐటీడీఏ ఇలా..2
2/3

ఐటీడీఏ ఇలా..

ఐటీడీఏ ఇలా..3
3/3

ఐటీడీఏ ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement