ఉన్నతి లక్ష్యం..!
నీరుగారిన
విజయనగరం ఫోర్ట్:
స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల జీవనోపాధులు మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన పథకమే ‘ఉన్నతి’. పథకం రుణాల మంజూరులో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం చూపుతోంది, రుణాల మంజూరు లక్ష్యాన్ని నీరుగార్చుతోంది. జీవనోపాధుల మెరుగుకు కనీస చొరవ చూపకపోవడం లబ్ధిదారులకు శాపంగా మారింది. ఎస్సీ,ఎస్టీలను ఆదుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యమని, వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధమని ఆయా వర్గాలు విమర్శిస్తున్నాయి.
● ఇదీ పరిస్థితి..
జిల్లాలో 40,203 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 3,751 ఎస్సీ, 731 ఎస్టీ గ్రూపులు ఉన్నాయి. బీసీ గ్రూపులు 34,639, ఓసీ గ్రూపులు 1063, మైనార్టీ గ్రూపులు 19 ఉన్నాయి. జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో 4,34,667 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఎస్సీ వర్గానికి చెందిన మహిళలు 39,614 మంది, ఎస్టీ మహిళలు 7,911 మంది, బీసీలు 3,75,719 మంది, ఎస్టీలు 11,237 మంది, మైనార్టీ మహిళలు 186 మంది ఉన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఉన్నతి పథకం కింద అర్హులైన 1,837 మంది లబ్ధిదారులకు రూ.9.18 కోట్లు రుణాలు మంజూరు చేయాలి. ఇంతవరకు 676 మందికి రూ.4.31 కోట్లు ఇచ్చారు. మరో రూ.4.87 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నెలరోజులే ఉంది. నెలరోజుల్లో రూ.4.87 కోట్లు రుణాలు మంజూరు చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ మహిళల ఆర్థిక ప్రగతికి ఆధారమైన రుణాల మంజూరులో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనేందుకు ఉన్నతి పథకం అమలులో నిర్లక్ష్యమే నిదర్శనమని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
● ఒక మహిళకు రూ.50వేల వరకు రాయితీ
ఉన్నతి పథకానికి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 25 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న మహిళలు అర్హులు. ఉన్నతి పథకం కింద జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. యూనిట్ విలువ ఎంత అయినా రూ.50 వేలు వరకు రాయితీ వర్తిస్తుంది. తీసుకున్న రుణంపై వడ్డీ ఉండదు. ఉన్నతి పథకం కింద డెయిరీ యూనిట్ మినహా కూరగాయలు, చీరలు విక్రయించుకునే దుకాణాలు, ఆకుల తయారీ మిషన్, పిండిమిల్లులు, ఆయిల్ మిల్లులు వంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, రుణాల మంజూరులో ప్రభుత్వ అలసత్వం మహిళలకు శాపంగా మారింది. రుణాల మంజూరుకు కొందరు మహిళల నుంచి ఖర్చుల నిమిత్తం సిబ్బంది రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.
ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు అందని ‘ఉన్నతి’ పథకం రుణాలు
మెరుగుపడని జీవన ప్రమాణాలు
ఆవేదనలో పొదుపు మహిళలు
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు


