మీరిచ్చిన హామీలే.. నెరవేర్చేదెన్నడో చెప్పండి...
చీపురుపల్లి:
అధికారంలోకి వస్తే.. బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం.. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేలు భృతి చెల్లిస్తాం.. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తాం.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.. విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్‌ను ఠంచన్‌గా చెల్లిస్తాం.. వలంటీర్లకు నెలకు రూ.10వేలు చెల్లిస్తాం.. రైతన్నలను ఆదుకుంటాం.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం.. పాలనలో ‘సూపర్ సిక్స్’ కొడతామంటూ ప్రచారం చేశారు. జనాన్ని నమ్మించి ఓట్లు కొల్లగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక జనానికి మోసం ఫిక్స్ చేశారు. 50 ఏళ్లకు పింఛన్ మాట పక్కనపెడితే 60 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్ మంజూరుకాని పరిస్థితి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వేలాది మంది పింఛన్లకోసం ఎదురుచూస్తున్నా పట్టించుకోని దుస్థితి. సుమారు రెండేళ్ల పాలనలో ఏ ఒక్క హామీని అమలుచేయకుండా పింఛన్ల పంపిణీ పేరుతో హామీల బాబు.. మళ్లీ డాబు కొట్టేందుకు చీపురుపల్లి ప్రాంతానికి వస్తున్నారంటూ జనం నవ్వుతున్నారు. జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్ది నిరుద్యోగులు వలసలు వెళ్ల్లకుండా ఇక్కడి నుంచే ఉద్యోగం చేసుకునే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు మాటలు గాలి మాటలుగానే మిగిలిపోయాయని విమర్శిస్తున్నారు. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా జిల్లాల పర్యటనలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవాచేస్తున్నారు.
జిల్లాలో ఒక్క హామీనీ పూర్తిస్థాయిలో నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం
నిధులు లేక కునారిల్లుతున్న సాగు నీటి ప్రాజెక్టులు
కనిపించని పారిశ్రామిక ప్రగతి
నిర్వీర్యం దిశగా సచివాలయాలు,
అగ్రిల్యాబ్‌లు
పాత పింఛన్ల పంపిణీకి
జిల్లా పర్యటనలు
కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయాలని సర్కారు
నేడు చీపురుపల్లికి రానున్న సీఎం
చీపురుపల్లి నియోజకవర్గంలో మూతపడిన ఫెర్రో పరిశ్రమలు తెరిపిస్తామని, ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు లేవు.
ఏపీఈపీడీసీఎల్‌లో విలీనమైన గ్రామీణ విద్యుత్ సహకార సంఘం(ఆర్‌ఈసీఎస్)ను తిరిగి పునురుద్ధరించి సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.
చీపురుపల్లి 100 పడకల ఏరియా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఆచరణ శూన్యంగానే కనిపిస్తోంది.
రాజాం మున్సిపాలిటీలో టిడ్కో ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికీ పూర్తికాలేదు.
మడ్డువలస, తోటపల్లి, నారాయణపురం సాగు నీటి కాలువలు అభివృద్ధి మాట రైతులనడిగితే తెలుస్తుంది.
నాగావళి నదిపై బలసలరేవు వంతెన నిర్మాణం నీటిమూటగానే మారింది.
బాడంగి మండలంలోని గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెనతో పాటు భోజరాజపురం వద్ద మరో వంతెన నిర్మిస్తామన్నారు. పనులే లేవు.
బొబ్బిలికి ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఎండమావిగానే మారింది.
చిలకపాలెం నుంచి రామభద్రపురం మీదుగా రాయగడ రోడ్డును విస్తరించి అభివృద్ధి చేస్తామన్నారు. పనులు ప్రారంభంకాలేదు.
ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖపట్టణం జిల్లాలో విలీనం చేస్తామన్నారు.
ఎస్.కోటలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగులు వలస వెళ్లకుండా చూస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు.
గజపతినగరం నియోజకవర్గంలోని సారవగెడ్డ మినీ రిజర్వాయర్ నిర్మాణం కలగానే మారింది.
రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు ఇప్పటికీ నత్తేనయంగా సాగుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు, విజయనగరం ప్రజలకు తాగునీటి సరఫరా ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితి.
కురుపాంలోని ఇంజినీరింగ్ కళాశాల, ఏనుగుల తరలింపు, గుమ్మలక్ష్మీపురంలో జీడి పరిశ్రమ ఏర్పాటు హామీలకే పరిమితమయ్యాయి. పూర్ణపాడు–లాభేసు వంతెన అసంపూర్తిగా మారింది.


